విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరిగిన తీరు కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. 'ఆ సమయంలో బ్రేకింగ్ సిస్టమ్, అలర్ట్ సిస్టమ్ ఎందుకు పని చేయలేదు?, సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైంది?, రైళ్ల కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా పని చేయకుండా పోయింది?, దీనిపై ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీ వేయాలి. దేశంలోని అన్ని మార్గాల్లోనూ ఈ ఆడిట్ జరగాల్సి ఉంది. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చూడాలి.' అంటూ ట్విట్టర్ లో ప్రధాని మోదీ, రైల్వే మంత్రిని జగన్ కోరారు.






తీవ్ర ఆవేదన


విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం ఘటనపై సీఎం జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మరో ట్వీట్ చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 'మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంత వరకూ ప్రభుత్వం అండగా ఉంటుంది. వారికి మెరుగైన వైద్యం అందించడం సహా, మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్ గ్రేషియా సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను.' అంటూ సీఎం జగన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.






సీఎం ఏరియల్ వ్యూ


అంతకు ముందు ప్రభుత్వాస్పత్రిలో బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం జగన్ ప్రమాద స్థలాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. 



కాగా, విజయనగరం జిల్లాలో కంటకాపల్లి వద్ద ఆదివారం రాత్రి విశాఖ - పలాస ప్యాసింజర్ రైలును విశాఖ - రాయగడ ప్యాసింజర్ ఢీకొన్న ఘటనలో 14 మంది మృతి చెందగా, వంద మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రమాదంపై రైల్వే ఉన్నత స్థాయి విచారణ చేపట్టింది.


Also Read: ట్రాక్ టెస్ట్ సక్సెస్ - ప్రమాదం తర్వాత 20 గంటల్లో ట్రాక్ పునరుద్ధరించిన అధికారులు