Shabara Sirimanotsavam : గిరిజనుల ఆరాధ్య దేవత శంబర పోలమాంబ సిరిమానోత్సవం మంగళవారం కన్నులపండువగా జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబరలో కొలువైన పోలమాంబ జాతరకు ఉమ్మడి విజయనగరం జిల్లాతోపాటు, ఒడిశా, చత్తీస్‌గడ్‌, తెలంగాణ  ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సోమ, మంగళవారాల్లో అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపారు. పసుపుకుంకుమలు, చీరలు సమర్పించుకున్నారు. భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈ సంబరంలో కీలక ఘట్టమైన సిరిమానోత్సవం మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రారంభమైంది. పూజారి జన్నిపేకపు రామారావు మేళతాళాలు నడుమ సిరిమాను అధిరోహించారు. తొలుత గరుడ వారి ఇంటి వద్ద పూజలు అందుకున్న అనంతరం.. సావిడి వీధిలోని మునసబు ఇంటి వద్ద పసుపు కుంకుమలు అందుకుని సిరిమాను ముందుకు సాగింది. ప్రధాన రహదారి మీదుగా ఎస్సీ కాలనీ, పనుకువీధి, గొల్లవీధి నుంచి తిరిగి సావిడివీధికి చేరుకుంది. అనంతరం అమ్మవారి ఘటాలను గద్దె వద్ద ఉంచడంతో సిరిమాను ఘట్టం ముగిసింది. పోలమాంబ అమ్మవారిని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సిరిమాను సంబరాన్ని పార్వతీపురం మన్యం జిల్లా అడిషనల్‌ ఎస్పీ దిలీప్‌ కిరణ్‌, విజయనగరం ఎస్పీ దీపిక పాటిల్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 



ఘనంగా జాతర నిర్వహణ 


ఉత్తరాంధ్ర ప్రజల ఆర్యాధ్య దేవత శంబర పోలమాంబ జాతర కన్నుల పండువగా జరుగుతుంది.  ప్రతి ఏటా జనవరి చివరివారంలో జరిగే ఈ గిరిజన వేడుకకు ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజుకు ముందు వచ్చే మంగళవారం గ్రామదేవత పోలమాంబను గ్రామంలోనికి తీసుకువస్తారు. పోలమాంబ శంబర గ్రామంలో పుట్టిపెరిగినందున గ్రామస్తులంతా పోలమాంబను తమ ఇంటి ఆడపిల్లగా భావిస్తారు. సంక్రాంతి పండుగకు ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్లే ఆనవాయితీ ఉంటుంది కనుక పోలమాంబ అమ్మవారిని సంక్రాంతి రోజుకు ముందు వచ్చే మంగళవారం గ్రామంలోనికి  తీసుకువస్తారు. సంక్రాంతి పండుగ తరువాత వచ్చే మంగళవారం అమ్మవారికి పూజలు నిర్వహించి ఆ తరువాత వచ్చే మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్ గఢ్‌, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు సిరిమానోత్సవంలో పాల్గొంటారు. 



అంపకోత్సవం రోజున గ్రామంలోకి పోలమాంబ


 శంబర పోలమాంబ జాతరలో సోమవారం తొలేళ్లు, మంగళవారం సిరిమానోత్సవం, బుధవారం అంపకోత్సవం జరుగుతాయి. జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రతి ఏటా ధనుర్మాసం ప్రారంభం రోజున పెదపోలమాంబ జాతర ప్రకటిస్తారు. వారం రోజులు ఘటాలను శంబరలో ఉంచి పూజలు చేస్తారు.  పెదపోలమాంబ అంపకోత్సవం రోజున పోలమాంబను గ్రామంలోకి తీసుకెళ్లడం ఆనవాయితీ. శంబర పోలమాంబ జాతర చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తాయి. ఆదివాసీల ఆరాధ్య దేవతగా పోలమాంబను పూజిస్తారు.