Nagabubu : జనసేన ఫ్యామిలీ సభ్యులను  చూడడానికి, వాళ్ల అభిప్రాయం తెలుసుకోవడంతో పాటు అవగాహన పెంచి వాళ్లలో ఉత్సాహం నింపడానికే  ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టానని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యడు నాగబాబు అన్నారు. గురువారం విజయనగరం జిల్లాలో ఆయన  పర్యటించారు. విజయనగరంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ లో కూర్చొని ఎవరో చెప్పింది తెలుసుకునే కంటే నేరుగా వచ్చి తెలుసుకోవాలనుకున్నానన్నారు. ఈ పర్యటన ద్వారా క్షేత్ర స్థానంలో పార్టీ పరిస్థితి తెలుసుకొనే అవకాశం వచ్చిందని తెలిపారు. కార్యకర్తలలో మంచి జోస్ ఉందని, నియోజకవర్గం సమస్యల చాలా లేవనెత్తారని, నాయకులలో చిన్న చిన్న విభేదాలు కూడా ఉండటం వాస్తవేమనన్నారు. 

ఖనిజ సంపద కోసమే

ఉత్తరాంధ్రలో విస్తారంగా ఖనిజ సంపద ఉందని వాటిని చాలా మంది దోచుకుంటున్నారని నాగబాబు మండిపడ్డారు. ప్రజల కోసం ప్రస్తుత నాయకులు పనిచేయడం లేదని ఖనిజ సంపద కోసమే పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ ఉత్తరాంధ్రలో వలసలు ఇంకా కొనసాగుతున్నాయని, ఉత్తరాంధ్ర ప్రజల రియల్ లైఫ్ ఎలా ఉంటుంది అన్నది జనసేన అధినేత పవన్ కల్యాణ్ దగ్గర ఉందని ఆయన  అన్నారు. దానిని ఎలా మార్చాలో అన్నది ఆయనకు తెలుసని తెలిపారు. చిరంజీవికి పార్టీలోకి వచ్చే ఆలోచన ఉంటే ఇప్పటకే వచ్చేవారన్నారు. కానీ ఆయన  సినిమాలకే మొగ్గు చూపుతున్నారని  కళామ్మసేవలోనే ఉంటారన్నారు. కానీ ఆయన మద్దతు మాత్రం జనసేనకే ఉంటుందన్నారు. ఏపీలో ఉన్న హెరిటేజ్ అండ్ కల్చర్న్ పూర్తిగా దెబ్బకొట్టారని వైసీపీపై విమర్శలు గుప్పించారు.

వెనక్కు నెట్టబడిన ప్రాంతం 

విజయనగరం జిల్లాను తమ ఆధిపత్య రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్న వారికి విశ్రాంతి ఇచ్చి జనసేనను గెలిపించాలని నాగబాబు కోరారు. ఖనిజాలు, నదులు, మత్స్యసంపద, ఇంకెన్నో ప్రకృతి వనరులు ఉన్న ఉత్తరాంధ్రను వెనుక బడిన ప్రాంతం అనే ఊత పదంగా ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఇన్ని ఆర్థిక వనరులు ఉన్నా ప్రజలు వలసలు వెళ్లి బతకాల్సిన పరిస్థితులు తీసుకొచ్చారన్నారు. ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం కాదని, వెనక్కు నెట్టబడిన ప్రాంతం అన్నారు. అధికార పార్టీ నేతలు అందినంత దోచుకుంటున్నాని ఆరోపించారు.