Pulivendula Latest News: పులివెందుల రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐదేళ్ల క్రితం హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పులివెందుల ఎన్నికల ప్రచారానికి గురువారం (మే 9) ఆమె కూడా రావడం అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలకు మద్దతుగా సౌభాగ్యమ్మ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా సౌభాగ్యమ్మ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ‘‘మన పులివెందుల ఆడ బిడ్డలు ఇద్దరు మీ ముందు ఉన్నారు. 5 ఏళ్లుగా పడుతున్న కష్టం మీకు తెలుసు. మన తెలుగు సంప్రదాయం ప్రకారం పుట్టింటికి వస్తే చీర, సారే పెట్టి పంపుతాం. మన ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి న్యాయం ఆడుతున్నారు. న్యాయం చేయడానికి ఇప్పుడు సమయం వచ్చింది. అందరం షర్మిలమ్మకి ఓటు వేసి గెలిపిద్ధాం. ఓటు వేసి షర్మిలమ్మ కొంగు నింపాలి.
ఓట్ల ద్వారా షర్మిల కొంగు నింపితే గెలిచి మన సమస్యలపై డిల్లీ వేదికగా పోరాటం చేస్తుంది. షర్మిలమ్మను గెలిపించాల్సిన అవసరం మనకు ఉంది. తిరిగి మనం వైఎస్ఆర్ పాలన చూడాలి. అది షర్మిలతోనే సాధ్యం. వివేకానంద రెడ్డి షర్మిలను ఎంపీ చేయాలని అనుకున్నాడు. అది అప్పట్లో జరగలేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. పార్టీలకు అతీతంగా షర్మిలను గెలిపించి రాజన్న పాలన చూడాలి’’ అని సౌభాగ్యమ్మ పులివెందుల ప్రజలకు పిలుపు ఇచ్చారు.