ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలనం రేపిన వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసులో ఆయన కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి తాజాగా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ కేసులో సునీతా రెడ్డి వివిధ అంశాలను వ్యతిరేకిస్తూ గతంలో చాలాసార్లు సుప్రీం కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా జరుగుతున్న వేళ ఇలా జరగడం చర్చనీయాంశం అయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి గతంలో బెయిల్ రద్దు ఇవ్వడంతో ఆ ఉత్తర్వులలో ఓ షరతును సుప్రీం కోర్టులో సునీతా రెడ్డి సవాలు చేశారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు జులై 1న మళ్లీ విడుదల చేయాలని సీబీఐ కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది.


వివేకానంద రెడ్డి హత్య కేసులో జూన్ నెలాఖరు లోపు దర్యాప్తు ముగించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దాంతో ఆ తర్వాత జులై 1న గంగిరెడ్డిని బెయిల్‌పై విడుదల చేయాలని హైకోర్టు తీర్పులో పేర్కొంది. అయితే, జులై 1న మళ్లీ బెయిల్‌పై గంగిరెడ్డిని విడుదల చేయాలన్న అంశంపై సునీతా రెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లారు. బెయిల్‌ను గంగిరెడ్డి దుర్వినియోగం చేసిన ఉదాహరణలు ఉన్నాయని పిటిషన్ లో చెప్పారు. సాక్షులను కూడా బెదిరించే అవకాశాలు ఉంటాయని వివరించారు. హత్యలు చేసిన వాళ్లు బయట ఉంటే సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. 


అయితే, సునీతా రెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు స్వీకరించింది. ఇది వచ్చేవారం విచారణకు వస్తుందని సమాచారం. అయితే సుప్రీంకోర్టు దీనిపై ఎలా స్పందిస్తుందో అనే అంశంపై అంతటా ఉత్కంఠ నెలకొంది.


మే 5న లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి


వివేకానంద రెడ్డి హత్య కేసులో గంగిరెడ్డిని ఆంధ్ర పోలీసులు 2019 మార్చి 28న అరెస్టు చేశారు. ఆ తర్వాత 90 రోజులు గడిచినా చార్జిషీట్‌ దాఖలు చేయలేదు. దీంతో అదే ఏడాది జూన్‌ 27న గంగిరెడ్డికి డీఫాల్ట్‌ బెయిల్‌ వచ్చింది. ఏపీ పోలీసుల దర్యాప్తు ఆశించిన స్థాయిలో లేదని.. కేసును సీబీఐకి ఇవ్వాలని వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించింది. ఆ తర్వాత ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోరగా, కోర్టు ఆ పిటిషన్‌‌ని తోసిపుచ్చింది. దీంతో సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లింది. 


తీవ్రమైన నేరారోపణలు ఉన్న సందర్భాల్లో స్పష్టమైన ఆధారాలు ఉంటే డీఫాల్ట్‌ బెయిల్‌ను రద్దు చేయొచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. సీబీఐ పిటిషన్‌పై మెరిట్‌ ఆధారంగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలంటూ కేసును మళ్లీ ఏపీ హైకోర్టుకు రిమాండ్‌ చేసింది. తదనంతర పరిణామాల్లో వివేకా హత్య కేసు దర్యాప్తు తెలంగాణకు బదిలీ అయింది. ఈ క్రమంలోనే ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు, అక్కడి నుంచి తాజాగా తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయింది. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు గంగిరెడ్డికి బెయిల్ రద్దు చేస్తూ.. మే 5వ తేదీన సీబీఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రకారం మే 5న ఎర్ర గంగిరెడ్డి కోర్టులో లొంగిపోయారు.