Andhra News : పల్నాడు జిల్లా సత్తెనపల్లి మాజీఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి వైఎస్ఆర్‌సీపీలో చేరారు.  వెంకటేశ్వర రెడ్డితో పాటు ఆ పార్టీలో ఆయన కుమారుడు నితిన్‌ రెడ్డి, సత్తెనపల్లి బీజేపీ కన్వీనర్‌ పక్కాల సూరిబాబు కూడా వైసీపీలో చేరారు.  సత్తెనపల్లి నుంచి యర్రం వెంకటేశ్వర రెడ్డి 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయనను వైసీపీలో చేర్చడంలో  ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో పాటు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో యర్రం వెంకటేశ్వరరెడ్డి జనసేన పార్టీ నుంచి బరిలో నిలిచారు. ఆ తర్వాత ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కొంత కాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. ఇప్పుడు వైసీపీలో చేర్చుకున్నారు.  యర్రం వెంకటేశ్వర రెడ్డి ఎలాంటి మచ్చ  లేని వ్యక్తి అని ఈ సందర్భంగా అంబటి రాంబాబు, లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. ఆయన పార్టీలో చేరడం వల్ల పార్టీకి మరింత బలం చేకూరుతుందని చెప్పారు. ఆయన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని అన్నారు.


ఎంపీ లావు కృష్ణదేవరాయులు ఇటీవలి కాలంలో పార్టీకి దూరంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయనకు సరైన ప్రోటోకాల్ ఇవ్వడం లేదన్న కారణంగా అసంతృప్తికి గురయ్యారని చెబుతున్నారు.  అయితే యర్రం వెంకటేశ్వరరెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. సీఎం దగ్గరకు వెళ్లిన బృందంలో ఆయన కూడా ఉన్నారు.  నర్సరావుపేట ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయులుకు తన నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించడానికి కూడా పెద్దగా అవకాశం లేకుండా పోయిందన్న అసంతృప్తి ఉంది. ఇటీవల చిలుకలూరిపేటలో జరిగిన సభలో.. సీఎం జగన్ కు నేరుగా తన అసంతృప్తిని తెలియచేశారు. ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లుగా చెబుతున్నారు.                   


సత్తెనపల్లిలో పార్టీ పరిస్థితిపై వైఎస్ఆర్‌సీపీలో భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని చిట్టా విజయభాస్కర్ రెడ్డి అనే ఇప్పటికే ప్రకటించారు.  మంత్రి అంబటికి వ్యతిరేకంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు వైసీపీ నేత చిట్టా విజయ భాస్కర్‌రెడ్డి.  సత్తెనపల్లి సీటుకోసం యుద్ధం చేస్తానని ప్రకటించారు. ఆయనకు చెక్ పెట్టడానికే కొత్తగా యర్రం వెంకటేశ్వరరెడ్డిని పార్టీలోకి తీసుకున్నారన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది.          



అంబటి రాంబాబు స్థానికేతరుడు. ఆయన రేపల్లె ప్రాంతానికి చెందినవారు. అక్కడే ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ పార్టీ పెట్టిన తర్వాత వైసీపీ లీడర్ గా ఆయన కాపు సామాజికవర్గం బలంగా ఉన్న సత్తెనపల్లిని ఎంచుకున్నారు. మొదటి సారి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. రెండో సారి పోటీ చేసి భారీ తేడాతో గెలుపొందారు. అయితే నియోజకవర్గంలో బలమైన వైసీపీ నేతల నుంచి ఎప్పటికప్పుడు అసంతృప్తిని ఎదుర్కొంటూనే ఉన్నారు.