Viveka Murder Case: ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే వివేక హత్య సమయంలో రాసిన లేఖపై విచారణ చేపట్టారు. అలాగే వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కుమారుడు ప్రకాష్ ను విచారించారు. ఇద్దరినీ కలిసి సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా ఇంట్లో వంట మనిషిగా పని చేస్తున్న లక్ష్మీదేవి కుమారుడే ప్రకాష్. తాజాగా ఇతడిని సీబీఐ విచారిస్తోంది. నిన్న పీఏ కృష్ణారెడ్డిని విచారించిన సీబీఐ అధికారులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. నేడు మరోసారి కృష్ణారెడ్డి, వంటమనిషి కుమారుడు ప్రకాష్ ను విచారిస్తున్నారు.
మంగళవారం కూడా వివేకా పర్సనల్ అసిస్టెంట్ కృష్ణా రెడ్డిని ప్రశ్నించారు. హత్యకు ముందు వివేకా రాసిన లేఖను కృష్ణా రెడ్డి దాచిపెట్టిన విషయం తెలిసిందే. అధికారులు ఆ విషయంపైనే ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. పగలు 3 గంటలకు కోఠిలోని సీబీఐ ఆఫీస్ కు వచ్చిన పీఏ కృష్ణారెడ్డిని 5 గంటలకు పైగా ప్రశ్నించారు. హత్య జరిగిన ప్రాంతంలో లభించిన కీలక ఆధారమైన ఆ లెటర్ ను ఎందుకు దాయాల్సి వచ్చిందో, అలా దాయమని ఎవరు చెప్పారో చెప్పాలంటూ కృష్ణారెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. ఆ లెటర్ ను మొదట ఎవరు గుర్తించారు, ఆ లెటర్ గురించి మీకెలా తెలిసింది, తర్వాత దాన్ని ఎక్కడ దాచి పెట్టారు, మీ వద్ద లెటర్ ఉన్నట్లు ఇంకా ఎవరితో అయినా చెప్పారా, లెటర్ ను పోలీసులకు ఎన్ని గంటల తర్వాత అప్పగించారు, అప్పటి వరకు లెటర్ ను దాయాల్సిన అవసరం ఏంటి అంటూ అనేక ప్రశ్నలను సీబీఐ అధికారులు సంధించినట్లు తెలుస్తోంది.
గతంలో సంచలన కామెంట్స్ చేసిన కృష్ణారెడ్డి
కృష్ణారెడ్డి గతంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. వివేకానందరెడ్డి చనిపోయారని సునీత, రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేస్తే... ఏం జరిగింది ఎలా జరిగిందో అని ఆరా తీయకుండా ఓకే అని ఫోన్ పెట్టేశారన్నారు. ఆ రోజు ఉదయం ఐదున్నరకు వివేకా ఇంటికి వెళ్లానని అన్నారు. అక్కడే ఉన్న ముందు గేట్ ఓపెన్ అయి ఉందని... అది గమనించి లోపలికి వెళ్లానని అన్నారు. అప్పటికీ వివేకా లేవలేదని తెలిపారు. పడుకున్నారేమో అని మళ్లీ నేను బయటకు వచ్చేశానని... ఆయన భార్య సౌభాగ్యకు ఫోన్ చేశానని తెలిపారు. నైట్ లేట్‌గా వచ్చారని ఇంకా కాసేపు పడుకోనిలే అన్నారని వివరించారు. ఇంతలో వంట మనిషి వచ్చినట్టు చెప్పారు.
మరోవైపు వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిల స్టేట్ మెంట్ ను నోటీసులు అందజేసింది. వైఎస్ వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనయ్ తుల్లా, ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్ రెడ్డిలను సీబీఐ మరోసారి ప్రశ్నించింది. వివేకా హత్యకు ప్రత్యక్ష సాక్షిగా ఇనయ్ తుల్లా అనే వ్యక్తి ఉన్నాడు. అలాగే వివేకా మృతదేహాన్ని బాత్ రూమ్ నుంచి బయటకు కూడా తీసుకు వచ్చింది ఇనయ్ తుల్లానే. గతంలో కూడా ఇతడిని సీబీఐ విచారించింది. మరోసారి సీబీఐ కార్యాలయంలో ఇనయ్ తుల్లాను విచారించి.. స్టేట్ మెంట్ రికార్డు చేసింది. అలాగే ఇనయ్ తుల్లా ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్ రెడ్డిల స్టేట్ మెంట్ ను సైతం సీబీఐ రికార్డు చేసింది.