Dharmana Krishna Das: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల గురించి ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ షాకింగ్ కామెంట్లు చేశారు. రాష్ట్రంలో మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామాల అంశం హాట్ టాపిక్ గా సాగుతున్న క్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, నర్సన్న పేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఒక వైపు ఏపీకి మూడు రాజధానులు సిద్ధమని, తాము రాజీనామాలు అయినా చేస్తామని కామెంట్లు చేస్తున్న తరుణంలో ధర్మాన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 


'నేను రాజీనామ చేస్తా'


ఏపీకి మూడు రాజధానులు కావాలని, అలాగే విశాఖ ను పరిపాలన రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు. తాము రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే చోడవరం శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ ఇప్పటికే రాజీనామా చేశారు. ఆయనతో పాటు తాను కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమని నర్సన్నపేట ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన ప్రకటించారు. ఈ క్రమంలోనే ధర్మాన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. వైసీపీ గెలవబోతోందని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ జోస్యం చెప్పారు. ఒకవేళ జగన్ మరోసారి సీఎం కాకపోతే తాను ఎమ్మెల్యేగా గెలిచినా.. తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఏపీలో మూడూ రాజధానులు కావాలని, దానికి మద్దతుగా వైసీపీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధమని ప్రకటిస్తున్న క్రమంలో ధర్మాన కృష్ణదాస్ నోటి వెంట రాజీనామా మాట రావడం ఆసక్తికరంగా మారింది. 


'ఆ దమ్ము ప్రతిపక్షాలకు ఉందా'


గడప గడపకు మన ప్రభువం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్... వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కార్యక్రమంలో సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీదే విజయమని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా.. ఒంటరిగా పోటీ చేస్తుందని వెల్లడించారు. జగన్ మోహన్ రెడ్డి సమర్థుడైన నాయకుడని, పొత్తు లేకుండా కూడా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోకుండా.. ఒంటరిగా పోటీ చేసే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. బాబుకు పవన్ వంత పాడుతున్నారని ధర్మాన కృష్ణ దాస్ ఆరోపించారు. జనసేని అధినేత పవన్ కల్యాణ్ కు ఇంకా రాజకీయ అనుభవం రాలేదని అన్నారు. రాజకీయాలు అంటే సినిమాలు కాదని నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ విమర్శలు గుప్పించారు.