Andhra Pradesh: అధికారం కోల్పోయిన తర్వాత ప్లాన్ ప్రాకారం వైసీపీ నేతలపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఓ అధికారితో సంబంధం ఉందంటూ వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఓ గిరిజన మహిళను అనవసరంగా ఇందులోకి లాగి పెద్ద తప్పు చేశారని హెచ్చరించారు. ఓ ఎంపీగా ఉన్నందున రకరకాల పనులపై చాలా మంది వస్తుంటారని అలాంటి వారందరితో సంబంధాలు అంటగడతారా అని ప్రశ్నించారు. 


వ్యక్తిగత పనులు, ఇతర అవసరాల కోసం చాలా మంది జర్నలిస్టులు కూడా తన వద్దకు వచ్చారని వారితో కూడా తనకు సంబందాలు ఉన్నాయా అని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. ఇలాంటి ఆరోపణలు, తప్పుడు విమర్శలకు విజయసాయిరెడ్డి భయపడే వ్యక్తి కాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా విజయసాయి రెడ్డి అనే వ్యక్తి తప్పు చేయడని స్పష్టం చేశారు. తాను తప్పు చేసినట్టైతే కచ్చితంగా వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడని అన్నారు. 


బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాల్సిన రాజ్యాంగంలో నాల్గో స్తంభమైన మీడియా ఇలాంటివి చేస్తుండటం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు విజయసాయిరెడ్డి. తనపై ఓ సెక్షన్ మీడియా కక్ష కట్టిందని అందుకే ఆధారాల్లేని ఆరోపణలతో వ్యక్తిత్వ హననానికి పూనుకున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి స్టోరీలు వేసిన ప్రతి ఒక్క మీడియా మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. 


ఆధారాల్లేకుండా ఓ మహిళను కించపరచడమే కాకుండా తన క్యారెక్టర్‌ను దెబ్బతీసేలా కథనాలు ప్రచారం చేసిన వారిపై లోక్‌సభలో పోరాడుతానన్నారు. న్యాయస్థానంలో కూడా పరువునష్టం దావా తానే వేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎడిటర్ గిల్డ్స్‌, ప్రెస్‌ కౌన్సిల్, జాతీయ మహిళా కమిషన్, గిరిజన శాఖ, ఇతర అన్ని వర్గాలను కలిసి జరిగిన వాస్తవాలను వివరిస్తామన్నారు విజయసాయిరెడ్డి. 


ఐదేళ్ల తర్వాత కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని లేదంటే మధ్యంతర ఎన్నికలు వచ్చినా తాము అధికారంలోకి వస్తామన్నారు విజయసాయిరెడ్డి. తాము అధికారంలోకి వస్తే ఇప్పుడు తోక జాడించిన వారందరి తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు. ఓ వ్యక్తిపై ఆరోపణలు వస్తే ఆ వ్యక్తి విరవణ తీసుకోవాలన్న ఆలోచన లేకుండా స్టోరీలు టెలికాస్ట్ చేయడం, డిబేట్స్ పెట్టడమేంటని నిలదీశారు. వారంతా క్షణాపణలు చేప్పేలా చేస్తామన్నారు. ఇకపై వారిని అనుక్షణం విజయసాయిరెడ్డి వెంటాడుతారని ఎందుకు ఆయనతో పెట్టుకున్నామనే స్థితికి తీసుకొస్తామన్నారు. 


అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం పని చేస్తున్న తన లాంటి ఎంపీపై ఇలాంటి ఆరోపణలు చేయడం క్షమించరాని నేరమన్నారు విజయసాయి రెడ్డి. హద్దులు మీరి ఇష్టానుసారాంగా ఆధారాలు లేకుండా అదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టు చెబుతున్నారు. ఈ కుట్ర వెనుక ఉన్నవారెవరు? తనకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించిన వ్యక్తులంతా చట్టానికిలోబడి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నా సరే విజయసాయి రెడ్డి పట్టుబడితే ఎంతవరకైనా వెళ్తాడని  అన్నారు. 
ఎంపీగా తనకు ఉన్న అధికారాలను ఉపయోగించుకొని వెంటాడతానన్నారు. దీన్ని ప్రచారం చేసిన వారందరిపై చర్యలు తీసుకోబోతున్నానని హెచ్చరించారు. ఏం చేసినా ముందే చెప్పి చేస్తా అన్నారు విజయసాయి రెడ్డి. 


ఇలాంటి లెటర్ అందితే రహస్యంగా విచారణ చేయాల్సిన అధికారి బుద్దిలేకుండా మీడియాకు లీక్ చేశారని ధ్వజమెత్తారు విజయసాయిరెడ్డి. దానిపై సరైన వివరణ తీసుకోకుండానే మీడియా కథనాలు రాసిందని మండిపడ్డారు. ఓ సామాజిక వర్గానికి చెందిన మీడియానే దీన్ని ప్రసారం చేశాయన్నారు. ఒక వ్యక్తి చేసిన ఆరోపణలతో ఓ మహిళ క్యారెక్టర్‌పై దాడి చేస్తారా అని ప్రశ్నించారు. తన క్యారెక్ట్‌ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. ఎవరో సంబంధం లేదని మహిళతో ఎలా సంబంధాలు ఎందుకు అంటగడుతున్నారని నిలదీశారు. 


రెండున్నరేళ్లు క్రితం ఛానల్‌ స్టార్ట్ చేద్దామని అనుకుంటే జగన్ చెప్పారని మానుకున్నట్టు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు ఎవరు చెప్పినా వినదల్చుకోలేదని తన ఛానల్ స్టార్ట్ చేయబోతున్నట్టు ప్రకటించారు. కులమీడియా తీరును ఎండగడతానని... న్యూట్రల్‌గా ఉంటూ ఛానల్‌ను నడుపుతానన్నారు. విజయసాయి రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఛానల్ మాత్రం న్యూట్రల్‌గానే ఉంటుందని స్పష్టం చేశారు. 


నెల రోజుల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరకేత మొదలైందన్నారు విజయసాయిరెడ్డి. దీన్ని బట్టి చూస్తుంటే 2029లో కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఇప్పుడు జరిగిన ఘటన ప్రభుత్వ అంతానికి ఆరంభమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి తప్పులు చేస్తూ వెళ్తుంటే ప్రజలు బుద్ది చెబుతారన్నారు. 


తాను ఎలాంటి తప్పు చేయలేదని తప్పు చేసినట్టు నిరూపించి ఏ శిక్ష అయినా వేసుకోవచ్చని సవాల్ చేశారు. తాను ఏం చేసిన ప్రజల కోసమే చేశానని తన స్వార్థం కోసం చేసిందేమీ లేదన్నారు. అందుకే కొందరు నేతలు చేస్తున్న ఆరోపణలకు భయపడాల్సిన పని లేదన్నారు. మధన్ మోహన్ అనే వ్యక్తి ఎవరో తెలియదన్నారు. స్కాల్‌షిప్ కోసం ఒకట్రెండు సార్లు మాత్రమే కలిసినట్టు పేర్కొన్నారు.