AP Politics: విశాఖపట్నం: ఇన్ ఛార్జ్‌ల మార్పుతో వైసీపీలో ముసలం పుట్టింది. వైరివర్గం విమర్శలకంటే సొంత పార్టీ నేతలే వచ్చే ఎన్నికల్లో వైసీపీ (YSRCP)కి ఎక్కువ ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పక్కదారి పట్టారు. ఇంకొందరు సైలెంట్ గా ఉన్నా సమయం వచ్చినప్పుడు తన తడాఖా చూపించడానికి రెడీగా ఉన్నారు. పోయేవాళ్లు పొండి, ఉండేవాళ్లు ఉండండి అంటూ పైకి వైసీపీ అధిష్టానం గంభీరంగా చెబుతున్నా లోలోపల కేడర్ కూడా తరలిపోతోందనే అనుమానం ఉండనే ఉంది. కొత్త ఇన్ చార్జ్ లను ప్రకటించిన చోట, సిట్టింగ్ ఎమ్మెల్యేల వర్గాలు ఇంకా హడావిడి చేస్తున్నాయి. తమకు పాత నాయకులే కావాలని గొడవలకు దిగుతున్నాయి. తాజాగా విశాఖలో నిర్వహించిన ఓ మీటింగ్ లో ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy)కి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ముందే నాయకులు నినాదాలు చేశారు. గాజువాక నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డిని మార్చకూడదని కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలు ఎక్కువ కావడంతో చివరకు వైవీ హడావిడిగా స్టేజ్ దిగి వెళ్లిపోయారు. 


గాజువాక నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ని ఓడించారు వైసీపీ నేత నాగిరెడ్డి. ఈసారి ఆయన కొడుకు అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. అయితే అక్కడ ఆ కుటుంబానికి టికెట్ లేకుండా కొత్తగా ఉరుకూటి రామచంద్రరావుని తెరపైకి తెచ్చింది అధిష్టానం. ఉరుకూటికి అక్కడ వైసీపీ టికెట్ ఖాయమైంది. ఆయన్ను ఇన్ చార్జ్ గా ప్రకటించారు. దీంతో నాగిరెడ్డి వర్గం అలకబూనింది. వైవీ సుబ్బారెడ్డి వారిని సర్దుబాటు చేసినా, కేడర్ మాత్రం తగ్గేది లేదంటున్నారు. వైవీ ముందే రచ్చ చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీటింగ్ లోనే వారు తమ అసంతృప్తిని బయటపెట్టారు. నాగిరెడ్డి మాత్రమే తమకు నాయకుడని, ఇంకెవరూ తమకు వద్దంటున్నారు నేతలు. 


మంగళగిరి నియోజకవర్గంలో ఇన్ చార్జ్ మార్పుతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటకు వెళ్లిపోయారు. ఇలాంటి చోట్ల ఇబ్బంది ఉన్నా అక్కడ వ్యవహారం క్లియర్ కట్ గా ఉంది. ఆళ్ల వర్గం ఎవరైనా ఉంటే ఆయనతో బయటకు వెళ్లిపోతారు. మిగిలిన వాళ్లు కొత్త ఇన్ చార్జ్ గంజి చిరంజీవితో కలసిపోయి వైసీపీ గెలుపుకోసం కృషి చేస్తారు. కానీ గాజువాక లాంటి చోట్ల పరిస్థితి తేడాగా ఉంది. నాగిరెడ్డి పార్టీకి రాజీనామా చేయలేదు, అలాగని కొత్త ఇన్ చార్జ్ కి జై కొట్టలేదు. ఆయన అనుచరులు మాత్రం గొడవ చేస్తున్నారు. నాగిరెడ్డికి మాత్రమే సీటు ఇవ్వాలంటున్నారు. ఈ విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్తానని వైవీ మాటిచ్చారు. ఆ మాటకు ఎంత వేల్యూ ఉందో ఆయనకు కూడా తెలుసు. ఒకసారి జగన్ కమిట్ అయ్యాక, ఇక అక్కడ ఇన్ చార్జ్ ని మార్చే ప్రసక్తి ఉండదు. అలాగని నాగిరెడ్డి పార్టీలోనే ఉంటూ ఇలా గొడవలు చేయిస్తుంటే అది మొదటికే మోసం. అందుకే అధిష్టానం ఆలోచనలో పడింది. 


మిగతా చోట్ల కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పటికిప్పుడు పార్టీని వదిలి బయటకు వెళ్లేందుకు నాయకులు ఇష్టపడటం లేదు. అదే సమయంలో తమ అనుచరులతో ఆందోళనలు చేయిస్తున్నారు. వీరందరితో వైసీపీ అంతర్గత రాజకీయాలు వేడెక్కాయి. మిగతా నియోజకవర్గాల విషయంలో కూడా మార్పులు చేర్పులు ఉంటే అప్పుడు హడావిడి మరింత పెరిగే అవకాశముంది. కానీ వైసీపీ మాత్రం ఓ విషయంలో క్లారిటీతో ఉంది. ఉండేవాళ్లు ఉండొచ్చు, నచ్చనివాళ్లు వెళ్లిపోవచ్చు అంటూ సజ్జల వంటి నేతలు ఇప్పటికే అసంతృప్తులకు క్లారిటీ ఇచ్చారు. వెళ్లేవారి గురించి వారు లైట్ తీసుకుంటున్నారు. అయితే ఈ అసంతృప్తులు పార్టీ విజయావకాశాలను ఏమేరకు దెబ్బతీస్తారనేదే అసలు పాయింట్.