Seediri Appalaraju: ఏపీ మంత్రి అప్పలరాజు రూటే సపరేటు - మీరు మారిపోయారు సార్ అంటున్న మద్దతుదారులు

AP minister Seediri Appalaraju: అంతా నేనే... నా మాటే శాసనం అనేలా వ్యవహరిస్తున్న మంత్రికి వైఎస్సార్‌సీపీ ప్లీనరీ వేదికగా మంత్రి సీదిరి అప్పలరాజు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Continues below advertisement

AP minister Seediri Appalaraju: ఎంబీబీఎస్ చదివిన ఆయనకు అనూహ్యంగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కింది. ఎన్నికల్లో గెలుపొందిన తొలిసారే మంత్రి పదవి సైతం వచ్చింది. అయితే ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం పని చేసిన వారినే ప్రస్తుతం ఆయన పక్కన పెట్టేశారు. కాదు కాదు... వదిలించుకుంటున్నారట. ప్రస్తుతం నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్ అవుతోంది. అంతా నేనే... నా మాటే శాసనం అనేలా వ్యవహరిస్తున్న మంత్రికి వైఎస్సార్‌సీపీ ప్లీనరీ వేదికగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసలు మేము లేకపోతే మీరు ఎక్కడ ఉండేవాళ్లో అంటూ స్థానిక నేతలు ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారట. ఆ వివరాలిలా ఉన్నాయి.

Continues below advertisement

డాక్టర్ సీదిరి అప్పలరాజు... శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి అధికార పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 వరకు వైద్యునిగా గుర్తింపు ఉన్న అప్పలరాజు... సీనియర్ నేత, మాజీ మంత్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కుమార్తె గౌతు శిరీషపై గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత అనూహ్యంగా సామాజిక వర్గాల ప్రాతిపదికన ఏడాదికే మంత్రిపదవి చేపట్టారు. అంతా వన్ టైమ్ మినిష్టర్ అంటుంటే... కాదు ఫుల్ టైమ్ అంటూ రెండో సారి కూడా పదవి చేపట్టారు. పైకి అంతా బాగానే ఉన్నట్లు పైకి కనిపిస్తున్నా.. నియోజకవర్గంలో మాత్రం ఆయన చెప్పిందే వేతం, ఆయన చేసిందే శాసనం, చట్టం అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది.

గతంలో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిన వారిని ఇప్పుడు క్రమంగా పక్కన పెడుతున్నారనే అపవాదు సీదిరి అప్పలరాజు మూటగట్టుకుంటున్నారట. గత ఎన్నికల్లో అంతా ముందుండి నడిపిన అనుచరులను ఇప్పుడు ఆయన వదిలించుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. పాత వారిని కాదని క్రమంగా కొత్తవారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం పార్టీలో జోరుగా వినిపిస్తోంది. పలాస నియోజకవర్గం వైసీపీ ప్లీనరీ సమావేశంలో జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం.

మంత్రి అప్పలరాజు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు తీవ్రంగా కృషి చేసిన వారిలో బల్ల గిరిబాబు ఒకరు. ప్రస్తుత పలాస - కాశీబుగ్గ మునిసిపాలిటీ ఛైర్మన్. గతంలో మంత్రికి అన్ని రకాలుగా అండ దండ.. ఇంకా చెప్పాలంటే నమ్మకమైన అనుచరుడు. ఏం చేయాలన్నా కూడా  గిరిబాబు సలహా తీసుకోకుండా అడుగు ముందుకు వేసేవారు కాదు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నువ్వేంత అంటే నువ్వేంత అనుకునే స్థాయికి చేరుకుంది. ఇందుకు ప్రధాన కారణం పలాసలో జరిగిన భూ దందాల్లో వాటాల పంపకాల్లో తేడా వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్లీనరీ వేదికపైకి వెళ్లిన వ్యక్తిని కూడా కిందకి దించేశారట. ఇటీవల పలాసలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతుండగా మైక్ కూడా కట్ చేశారట. ఇవన్నీ చూస్తుంటే ఆయనను పొమ్మనలేక పొగపెడుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాసు అందరీని కలుపుకు పోదామని వస్తే ఆయన కూడా మాట్లాడకుండా వేదికపై మంత్రితో గమ్మునున్నారట.

మంత్రి అప్పల్రాజుపై ఘాటు వ్యాఖ్యలు
పార్టీ ప్లీనరీ వేదికగా మంత్రి అప్పల్రాజుపై కాశీబుగ్గ మునిసిపాలిటీ ఛైర్మన్ గిరిబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఎలాంటి తగిన గౌరవం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూదికొండ, నెమలి కొండ కబ్జాల్లో జాతీయ రహదారి పక్కనే ఉన్న చెరువు కబ్జా వాటాల్లో  పంపకం దగ్గర తేడా వచ్చినట్లు స్థానికంగా చర్చ మొదలైంది. తొలి నుంచి పార్టీలో ఉన్న తమను పక్కన పెట్టి మంత్రి అప్పలరాజు ఇప్పుడు కొత్త వారిని అక్కున చేర్చుకోవడంతో గిరిబాబు వర్గం సైతం ఆగ్రహంగా ఉన్నారు.

ఇప్పటికే నియోజకవర్గంలో దువ్వాడ శ్రీకాంత్‌తో మంత్రి అప్పలరాజుకు అంతగా పడదు. తాజాగా బల్ల గిరిబాబు వర్గం కూడా మంత్రికి కొత్త తలనొప్పిగా మారుతోంది. పలాస - కాశీబుగ్గలో 80 శాతం ఓట్ల వచ్చి, వీరివల్లనే మంత్రి గెలిచారు. అలాంటి నేతల్ని దూరం చేసుకోవడం.. ప్లీనరీ వేదికగా జరిగిన ఘటన ప్రస్తుతం నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనే హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ ప్లీనరీకి తనని ఆహ్వానించకపోవడంపై బల్ల గిరిబాబు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పట్టణ తొలి పౌరుడిగా, పార్టీలో సీనియర్ నేతగా ఉన్న తాను గుర్తుకు రాలేదా అంటూ పార్టీ పెద్దల్ని నిలదీస్తున్నారు.

సీఎం జగన్ పర్యటన సమయంలో విభేదాలు..
జూన్ 27న అమ్మఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన సమయంలో ఈ విభేదాలు మొదలయ్యాయి. సీఎం జగన్ హెలీప్యాడ్ పనులను పోలీసులతో కలిసి అప్పలరాజు పర్యవేక్షించారు. తన అనుచరులను, చివరికి వార్డు మెంబర్లు కూడా తన వెంట తీసుకెళ్లిన మంత్రి అప్పలరాజు.. ఛైర్మన్ గిరిబాబును మాత్రం బయటే వదిలేశారు. ఇక పట్టణంలో పనులు సైతం గిరిబాబును కాదని నేరుగా మంత్రి అప్పలరాజు దగ్గరికి వెళుతున్నారు. మునిసిపాలిటీకి వెళ్లాల్సిన పని లేకుండానే పనులు జరిగిపోతున్నాయనేది ప్రస్తుతం జోరుగా వినిపిస్తున్న మాట. ఇందుకు మంత్రి స్వయంగా కొందర్ని నియమించుకున్నారని... పనులు తానే చేయిస్తూ పెత్తనం చెలాయిస్తున్నట్లు మంత్రి అప్పలరాజుపై  గిరిబాబు వర్గం గుర్రుగా ఉంది.

Also Read: Chiru Pawan Meets: ఒకే రాజకీయ వేదికపై చిరంజీవి, పవన్ కళ్యాణ్ - ప్రజారాజ్యం తర్వాత 13 ఏళ్లకు తొలిసారి అరుదైన సందర్భం

గతంలో తనకు ఎంతో సహకరించిన గిరిబాబును కాదని కొత్త వ్యక్తులను చేరదీసి వారితోనే పనులు పూర్తి చేయిస్తూ మున్సిపాలిటీలో ప్రథమ పౌరుడిని మంత్రి పక్కన బెట్టారట. అందులో భాగంగానే హెలిప్యాడ్ ఇష్యూ, ఇప్పుడు ఈ ప్లీనరీ ఇష్యూ... రాబోయే 2024 ఎన్నికలకు మంత్రిగారికి ఆ నలుగురే అంతా. కొత్త మంత్రి తీరు పార్టీ వర్గీయులతో పాటు స్థానికులకు సైతం కొంత కొత్తగానే ఉందని తెలుస్తోంది.

Continues below advertisement