కర్ణాటక ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా లేనప్పటికీ బీజేపీ గత ఎన్నికల్లో సాధించిన 36% ఓట్ల శాతాన్నే ప్రస్తుత ఎన్నికల్లో కూడా సాధించినదని, బీజేపీ ప్రజాదరణలో ఏమాత్రం మార్పు లేదని ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యానించారు. కేవలం జేడీఎస్ పార్టీకి తగ్గిన ఓట్ల శాతం కాంగ్రెస్ కు కలవడం వల్ల మాత్రమే కర్ణాటకలో కాంగ్రెస్ ఈ ఫలితాలు సాధించగలిగిందని బిజెపి ఓటు బ్యాంకు పూర్తిగా ఎప్పటిలాగే స్థిరంగా నిలిచి ఉందని జీవీఎల్ వ్యాఖ్యానించారు.
ఇదే విధమైన ఫలితాలు అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనేకసార్లు ఇంతకు ముందు వచ్చినప్పటికీ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించి ఎవరి సహాయం అవసరం లేకుండా పూర్తి మెజారిటీతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదని ఆయన అన్నారు. కేవలం స్థానిక అంశాల ప్రాతిపదిక ఆధారంగా మెజార్టీ సాధించే ఇటువంటి ఎన్నికలు ఇతర రాష్ట్రాలపై ఏమాత్రం ప్రభావాన్ని చూపవని, ప్రతి రాష్ట్రానికి ఆయా రాష్ట్రాల స్థానిక సమస్యలు మాత్రమే ప్రధాన పాత్ర పోషిస్తాయని జీవీఎల్ వ్యాఖ్యానించారు.