Vizianagaram Crime News: హత్య కేసులో తనను ఇరికించి జైలుకి పంపించారని, తనకు న్యాయం చేయాలని లేకపోతే తనని ఉరి తీయాలి అని ఓ స్వర్ణకారుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్వర్ణ కారుడు పొన్నాడ శివ కుమార్ డాబాగార్డన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో తనను ఒక మర్డర్ కేసు లో ఇరికించి జైలుకు పంపించారు అని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆ హత్య కేసుకి తనకు ఎటువంటి సంబంధం లేదు అన్నారు. హంతకులు మాత్రం స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని చెప్పారు. కానీ తాను ఆ హత్య చేయలేదని నిరూపించడానికి తన వద్ద సాక్ష్యంగా వీడియోలు ఉన్నాయని తెలిపారు. 


తన తల్లి పొన్నాడ కృష్ణవేణి హత్య కేసులో ఐదేళ్లు తాను జైలు శిక్ష అనుభవించినట్లు తెలిపారు స్వర్ణకారుడు. అయితే ప్రముఖ బంగారం వ్యాపారి, టీడీపీ మాజీ కార్పొరేటర్ హత్య కేసులో హంతకుడు అని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న వీడియోలు తన వద్ద ఉన్నాయన్నారు. తనకు బెయిల్ కోసం తమకు ఇవ్వవలసిన బంగారం ఇస్తాను అని నిందితులు ఆశ చూపారు అని సంచలన విషయాలు వెల్లడించారు. కనుక తన వద్ద ఉన్న వీడియో సాక్ష్యాలు తీసుకుని, పోలీస్ శాఖ విచారణ చేపట్టాలని కోరారు. ఆ హత్య కేసులో దోషులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకోలేని పక్షంలో తనకు చట్ట పరంగా ఉరి శిక్ష విధించమని భోగాపురం పోలీసుల ద్వారా హై కోర్టులో పిటిషన్ వేస్తున్నట్లు చెప్పారు. 
చట్ట ప్రకారం అధికారులు, పోలీసులు ఉరి శిక్ష వేయకపోతే, తనకు తాను ఉరి శిక్ష వేసుకోవడం కూడా అంగీకారమే అన్నారు. ఈ కేసులో అసలైన హంతకుడు నుంచి తనకు ప్రాణ హాని ఉందని స్వర్ణకారుడు పొన్నాడ శివ కుమార్ ఆరోపించారు. పోలీసులు తనకు చట్ట ప్రకారం రక్షణ కల్పించాలని కోరారు. తనను అన్యాయంగా కేసులో ఇరికిస్తే, అయిదేళ్లు జైల్లో ఉండి బెయిల్ పై బయటకు వచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అసలైన దోషులు బయట తిరుగుతున్నారని, విచారణ చేపట్టి అసలైన దోషులకు శిక్ష వేయాలని పోలీసులను కోరారు. లేని పక్షంలో. భోగాపురం స్టేషన్ వారు హైకోర్టు ద్వారా తనకు ఉరిశిక్ష వేయండి అని కన్నీళ్లతో వేడుకున్నారు. 
తల్లి హత్యతో కష్టాలు మొదలు..
విజయనగరంలో కుటుంబ ఆస్తులు ఉన్నాయని.. కొన్నేళ్ల కిందట తన తల్లి పొన్నాడ కృష్ణవేణి, సోదరి, బావతో కలిసి అక్కడే నివాసం ఉండేవాడినని చెప్పారు. బంగారం ఆభరణాల వ్యాపారం చేస్తుంటామని తెలిపారు. గతంలోనే తన తండ్రి చనిపోయారని, ఆయన ఆస్తి పంపకాలకు రాసిన వీలునామా కుటుంబంలో గొడవలకు దారితీసిందన్నారు. ఇదే అదనుగా కొందరు తన తల్లిని హత్య చేసి తనను కేసులో ఇరికించారు అని ఆరోపించారు. ఈ కేసులో అసలైన హంతకుడుతో తన తల్లికి బంగారం లావాదేవీలపై గొడవలు జరిగాయన్నారు. తాను కుటుంబ సభ్యులతో కురుపాం మార్కెట్ వద్ద నివాసం ఉన్నానని తెలిపారు.


2014లో విజయనగరం జిల్లాలో తన తల్లి హత్యకు గురైనట్లు తెలిపారు. ఆ సమయంలో తాను విశాఖలో ఉన్నా కూడా అన్యాయంగా కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 25న హైకోర్టులో కేసు తదుపరి విచారణ ఉందన్నారు. అధికారులు, పోలీసులు ఇప్పటికైనా మరోసారి విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షిస్తేనే తనకు న్యాయం జరుగుతుందని.. లేనిపక్షంలో తనను ఉరితీయాలని కోరారు.