Vizag Utsav 2026: "సీ టూ స్కై" థీమ్‌తో వైజాగ్‌లో విశాఖ ఉత్సవ్ ఈరోజు అంటే శనివారం నుంచి ఫిబ్రవరి 1 వరకూ జరుగుతోంది. ఒకేసారి మూడు చోట్ల విశాఖ-అరకు-అనకాపల్లి లో రోజూ వేడుకలు జరిగేలా రాష్ట్ర పర్యాటక శాఖ ప్లాన్ చేసింది.

విశాఖ ఉత్సవ్ -ఫుల్ షెడ్యూల్ ఇదే 

1) విశాఖపట్నంలో జనవరి 24 నుంచి 31 వరకు కార్యక్రమాలు జరుగనున్నాయి. వీటికి ఆర్.కె. బీచ్  ప్రధాన వినోద వేదిక కానుంది. ఇక్కడ ప్రతిరోజూ సాయంత్రం 6:00 నుంచి రాత్రి 10:00 గంటల వరకు లైవ్ కచేరీలు, డ్రోన్ షోలు నిర్వహిస్తారు. ఎంజీఎం గ్రౌండ్స్‌లో ప్రారంభ వేడుక, పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పుష్ప ప్రదర్శన, కిడ్స్ జోన్‌లు, ఆహార, షాపింగ్ స్టాల్స్ ఉండనున్నాయి.

రుషికొండ బీచ్ లో అడ్వంచర్ గేమ్స్,వాటర్ స్పోర్ట్స్,స్కూబా డైవింగ్, హెలికాప్టర్ రైడ్స్ జరుగుతాయి. పోర్ట్ స్టేడియంలో 50% తగ్గింపు ధరతో వినోద క్రీడలు, వాటర్ స్పోర్ట్స్ జరుగుతాయి. సాగర్ నగర్ బీచ్‌లో లైఫ్ స్టైల్, విశ్రాంతి జోన్‌లు ఉంటాయి. జనవరి 27, 28లో భీమిలి బీచ్‌లో సాంస్కృతిక ప్రదర్శనలు, బోట్ రేసులు జరుగుతాయి. జనవరి 31న  కార్నివాల్ వాక్ జరుగుతుంది. విశాఖలోని సన్ ఇంటర్నేషనల్ కాలేజ్‌లో జనవరి 28,29న ఉదయం 10:00 గంటల నుంచి వంటల పోటీలు జరుగుతాయి. 

అనకాపల్లి జిల్లా బొజ్జన కొండలో జనవరి 29, 30 తేదీల్లో ధ్యానం, వారసత్వ కార్యక్రమాలు జరుగుతాయి. స్థానిక ఉపమాక, నూకాంబిక ఆలయాల్లో జానపద నృత్య కార్యశాలలు జరుగుతాయి. కొండకర్ల ఆవలో ఎకో-టూరిజం వర్క్‌షాప్‌లు, హస్తకళలు, బోటింగ్ నిర్వహిస్తారు. ముత్యాలంపాలెం, రేవు పోలవరం బీచ్‌లో పారామోటార్ రైడ్స్ జరుగుతాయి. బెల్లం మార్కెట్ యార్డ్ లో ఫ్లీ మార్కెట్, సామాజిక వినోద కార్యక్రమాలు జరుగుతాయి. స్థానిక ఎన్.టి.ఆర్ స్టేడియం సాంస్కృతిక ప్రదర్శనలు స్టార్ కన్సర్ట్స్ నిర్వహిస్తారు.

జనవరి 29న రామ్ మిరియాల లైవ్ ఫర్ఫార్మెన్స్ ఉంటుంది. జనవరి 30న పాపులర్ సింగర్స్ సునీత /మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీత విభావరి జరుగనుంది. 

అరకులో 30 జనవరి, 1 ఫిబ్రవరిన సైక్లింగ్ ట్రైల్స్, గిరిజన ఊరేగింపులు, జానపద ప్రదర్శనలు, నేచర్ వాక్స్, కాఫీ ఫెస్టివల్స్, ఎకో-టూరిజం, అరకు పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజూ సాంస్కృతిక వినోద కార్యక్రమాలు జరుగుతాయి.

మొత్తం 9రోజుల పాటు జరిగే ఈ విశాఖ ఉత్సవ్ లో 20 వేదికలు, 500కుపైగా ఈవెంట్లలో 650 మంది కళాకారులు పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఈ ఉత్సవం ద్వారా దాదాపు రూ.500 కోట్లకుపైగా ఆర్థిక లావాదేవీలు జరిగేందుకు అవకాశం ఉందనీ అలాగే 3000 మందికి ప్రత్యక్షంగా మరో 1800 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

విశాఖ ఉత్సవ్ ను విజయవంతం చేయండి: మంత్రి కందుల విజ్ఞప్తి 

ఈరోజు నుంచి 9 రోజుల పాటు జరిగే విశాఖ ఉత్సవ్ ను ప్రజలంతా కలిసి విజయవంతం చేయాలనీ ఏపీ పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పిలుపు ఇచ్చారు. ఈరోజు నుంచి 9 రోజుల పాటు జరిగే విశాఖ ఉత్సవ్ కు దాదాపు 10లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. జనాలకు ఇబ్బంది కలగకుండా భద్రతా ఏర్పాట్లఫై జిల్లా కలెక్టర్ సహా స్థానిక అధికారులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.