సాగర నగరం విశాఖపట్నంలోని వన్ టౌన్ లో గల కన్యకాపరమేశ్వరి ఆలయం బంగారం, నోట్ల కట్టల వెలుగులో మెరిసిపోతుంది. దసరా పండుగ సందర్భంగా గుడి మొత్తాన్ని కరెన్సీ నోట్లతో అలంకరించారు. అంతేకాక 6 కేజీల బంగారం, వెండితో అమ్మవారిని పాదపీఠాన్ని కప్పేశారు. ప్రతీ ఏడాది ఇలానే దసరా పండుగ సందర్భంగా చేస్తుంటామని .. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది రెట్టింపు డబ్బుతో ఆలయాన్ని అలంకరించినట్టు భక్తులు తెలిపారు. 


145 ఏళ్ల  పురాతన ఆలయం 
విశాఖ లోని వన్ టౌన్ లో గల ఈ పురాతన ఆలయం 145 ఏళ్ల నాటిది. జగదాంబ థియేటర్ నుండి పూర్ణ మార్కెట్ దాటి వెళితే ఈ ఆలయం రోడ్డు ను ఆనుకునే కనిపిస్తుంది. ఈ ఆలయం కన్నె పూజలకు ప్రసిద్ధి. పెళ్లికాని అమ్మాయిలు ఇక్కడ పూజలు జరిపిస్తే పెళ్లి అవుతుందని ఇక్కడి భక్తులకు నమ్మకం. అలాగే ... దసరా రోజు అమ్మవారి పాదాల ముందు డబ్బును ఉంచితే వారికి ఏడాదంతా ధనలాభం కలుగుతుందని కూడా ఒక నమ్మకం స్థానికులలో బలంగా ఉంది. అందుకే దసరా రోజులలో భక్తులు అమ్మవారి గర్భగుడి ని డబ్బులతో నింపేస్తారు. 


అంతా భక్తుల డబ్బే
దసరా రోజులలో కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని అలంకరించే డబ్బు అంతా  భక్తులదే. పండుగ రోజులలో అమ్మవారి ముందు డబ్బు, బంగారం ఉంచి తరువాత వాటిని ఇళ్లకు తీసుకెళతారు. ఎంతో చిన్నగా ఉండే ఈ ఆలయంలో అన్ని నోట్ల కట్టలూ .. కేజీల కొద్దీ బంగారం ఉంచినా.. ఎవ్వరూ వాటికోసం ఆశపడిన సందర్భాలు గానీ .. దొంగతనాల వంటి సంఘటనలు గానీ జరగలేదని .. ఇదంతా అమ్మవారి మహిమే అనీ ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు. గత ఏడాది కోటిన్నర డబ్బు అమ్మవారి ముందు ఉంచితే.. ఏడాది భక్తులు ఏకంగా మూడున్నర కోట్ల డబ్బు తో అమ్మవారిని అలంకరించారని.. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని.. కన్యకా పరమేశ్వరి ఆలయం ప్రసిద్ధి రోజురోజుకూ పెరుగుతూ ఉండడమే దీనికి కారణం అని ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఏదేమైనా .. స్మార్ట్ సిటీ వైజాగ్ లోని ఓ చిన్న ఆలయాన్ని ఇలా భక్తులే కోట్ల కొద్దీ డబ్బు , కేజీల కోద్దీ  బంగారం ,వెండిలతో అలంకరించడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.   


శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అంటేనే సంపదకు ప్రతిరూపం! అందుకనే ఆ తల్లిని ‘శ్రీ మహాలక్ష్మి’ అని పిలుస్తారు. ‘శ్రీ’ అంటే సిరిసంపదలే. అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైనా నెరవేరుతుందని నమ్మకం. అమ్మవారు అనుగ్రహించే వరాలను బట్టి ఆమెను ఎనిమిది రూపాలలో పూజిస్తారు. వాళ్లే అష్టలక్ష్ములు. దసరా సందర్భంగా మహాలక్ష్మిని కనుక పూజిస్తే ఈ అష్టలక్ష్ములంతా అనుగ్రహిస్తారు. దసరా సమయంలో అమ్మవారిని గులాబి రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఇక పాలసముద్రం నుంచి ఉద్భవించినందుకు ప్రతీకగా ఆ తల్లికి తెల్లటి కలువలతో పూజ చేయాలి. తెల్ల కలువులతో పూజ చేయడం కుదరకపోతే అదే రంగులో ఉండే మల్లెలాంటి పూలతో అయినా అర్చించవచ్చు. ఇక అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్ని గుర్తుచేసుకుంటూ పాలతో చేసిన పరమాన్నాన్ని తల్లికి నివేదించాలి. పరమాన్నం చేయడం కుదరని పక్షంలో అటుకులు, బెల్లం, కొబ్బరి కలిపిన ప్రసాదాన్ని కూడా సమర్పించవచ్చు.