స్మార్ట్ సిటీ వైజాగ్ లో రోజుకో కొత్త టూరిజం ఎట్రాక్షన్ పుట్టుకొస్తుంది. ఇప్పటికే నగరం లోని ఆర్కే బీచ్, జూ, సింహాచలం, కైలాసగిరి లాంటి అనేక ప్రాంతాలు ఎంతో పాపులర్ కాగా వాటికి యాడ్ ఆన్ గా సీత కొండ వ్యూ పాయింట్ చేరింది. కైలాసగిరి దాటిన తరువాత తెన్నేటి పార్కు పక్కనే ఉండే ఈ సీతకొండ సముద్రానికి కాస్త ఎత్తుగా ఉంటుంది. అక్కడి నుండి చూస్తే జులాయి సినిమాలో కోట శ్రీనివాసరావు అన్నట్టు సముద్రం మన కాళ్లక్రింద ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఇంతకాలం దీనిపై అధికారులు పెద్దగా ఫోకస్ చేయలేదు. అయితే జీ -20 కాన్ఫెరెన్స్ పుణ్యమా అని వైజాగ్ లోని చాలా ఏరియాల ను ఆఘమేఘాల మీద డెవలప్ చేస్తున్నారు. వీటికోసం వంద కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది జీవీఎంసీ. వాటిలో భాగంగా సీతకొండ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు అధికారులు. 




స్పెషల్ ఎట్రాక్షన్ - " ఐ లవ్ వైజాగ్ "
2014 తరువాత దేశం లోని  ప్రతీ ఊరి లోనూ ఐ లవ్ మై సిటీ పేరుతొ అక్షరాలను ఏర్పాటు చేస్తున్నారు. వైజాగ్ లో కూడా కురుసురా సబ్ మెరైన్ మ్యూజియం ఎదురుగా ఎప్పటినుండో ఇలాంటి యాంబ్లమ్ ను ఏర్పాటు చేశారు. అయితే లేటెస్ట్ గా సీత కొండ  వద్ద ఏర్పాటు చేసిన  "ఐ లవ్ వైజాగ్ " అక్షరాలు.. వాటి మధ్యలో డాల్ఫిన్ బొమ్మలు లేటెస్ట్ ఎట్రాక్షన్ గా మారాయి. దానితో సాయంత్రం పూట సీతకొండ కు వెళ్లే టూరిస్టుల సంఖ్య పెరుగుతోంది. టీనేజర్లు అయితే ఐ లవ్ వైజాగ్ అక్షరాల వద్ద సెల్ఫీ లతో ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్న ఫోటోలు, వీడియో లు నెటిజన్ లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.  అక్షరాల మధ్య నుండి కనపడే సముద్రం.. మరోపక్క ఎత్తైన కొండ వైజాగ్ వాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరెందుకు ఆలస్యం మీరు వైజాగ్ విజిట్ చేస్తే చూడాల్సిన ప్రాంతాల లిస్టు లో సీత కొండ నూ యాడ్ చేసేయండి.