Clay Ganesh: వినాయక చవితి వచ్చేస్తుంది. వినాయక విగ్రహాలూ రెడీ అయిపోతున్నాయి. అయితే గతంతో పోలిస్తే మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. విద్యాధికులు ఎక్కువగా ఉండే వైజాగ్ లో పర్యావరణం పట్ల అవగాహన కూడా ఎక్కువే. అందుకే పర్యావరణానికి హాని చేసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల బదులు మట్టితో తయారయిన గణపతి విగ్రహాలకు జనం ఓటేస్తున్నారు. అందుకే విశాఖలో మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలకు డిమాండ్ పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇన్నాళ్లూ కృత్రిమ పదార్ధాలతో తయారు చేసిన విగ్రహాల స్థానంలో మట్టితో విగ్రహాల తయారీని పెంచారు కళాకారులు. 


ఐదు రోజుల నుంచి వారం రోజుల్లో చేసేయొచ్చు..
నిజానికి గత రెండేళ్లుగా కొవిడ్ వల్ల  అనుకున్న స్థాయిలో గణపతి విగ్రహాల బిజినెస్ జరగలేదని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది  ఆంక్షలు పెద్దగా లేకపోవడంతో వినాయక మండపాలు ఏర్పాటు చేసేందుకు భక్తులు రెడీ అవుతున్నారు. దానితో గణపయ్య విగ్రహాల కోసం డిమాండ్ పెరిగింది. అయితే గతంలోలా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాల కంటే మట్టి గణపతులను మండపాలలో పెట్టేందుకే ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విగ్రహాలను ఆర్డర్ ఇచ్చాక సైజు బట్టి 5 నుండి వారం రోజుల్లో రెడీ చేసెయ్యగలమని చెబుతున్నారు. ఈ ఏడాది డిమాండ్ బాగుందని అయితే కొవిడ్ కు ముందున్న పరిస్థితితో పోలిస్తే మాత్రం డిమాండ్ తక్కువేనని  అంటున్నారు.




12 నుంచి 15 అడుగుల వరకూ తయారు చేయొచ్చు..


మరోవైపు చాలా మందిలో మట్టితో పెద్ద విగ్రహాలను తయారు చెయ్యలేమని  అపోహ ఉందని అందుకోసమే అలాంటి వారంతా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కొంటారని కార్మికులు వివరిస్తున్నారు. కానీ మట్టితో కూడా భారీ విగ్రహాలను తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు . విశాఖలో ఆవిధంగానే భారీ గణేష్ విగ్రహాలు రెడీ అవుతున్నాయన్నారు. వీటి ఎత్తు, సైజును బట్టి 5 వేల నుండి 60 వేల వరకూ రేటు ఉంటుందని, మూడు అడుగుల ఎత్తు నుండి 12-15 అడుగుల ఎత్తున్న మట్టి విగ్రహాలు   తయారు చేస్తున్నామని వ్యాపారాలు చెబుతున్నారు. 




కళాకారులతో పాటు మట్టిని కూడా తెప్పిస్తున్నారు..


ఈ మట్టి విగ్రహాల తయారీ కోసం విశాఖ సమీపంలోని పెందుర్తి ప్రాంతంలో దొరికే మట్టితో పాటు, బెంగాల్ లాంటి ఇతర రాష్ట్రాల నుండి కూడా మట్టిని తెప్పిస్తుంటారు. దానిలో గడ్డిని కలిపి, కాళ్లతో తొక్కి అలా వచ్చిన మిశ్రమంతో వినాయక విగ్రహాలను రెడీ చేస్తారు. వీటికి రంగులు వేసస్తే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారయిన విగ్రహాలకంటే ఎక్కువ జీవకళతో రెడీ అవుతాయి. ఇలా మట్టితో విగ్రహాలను తయారుచేసే కళలో నిష్ణాతులు కావడంతో బెంగాల్ నుండి కార్మికులను రప్పిస్తుంటారు వ్యాపారాలు. వినాయక చవితి సీజన్ అయ్యే వరకూ వారు ఇక్కడే ఉండి పనులు పూర్తి చేసుకుని వెళుతుంటారు. ఇలా మట్టి విగ్రహాలు తయారు చేసే సంస్థలు విశాఖలో మూడు నాలుగు ఉండగా.. ఒక్కో దుకాణానికి వివిధ సైజుల్లో 15 వేల వరకూ ఆర్దర్లు  వచ్చినట్టు వ్యాపారులు చెబుతున్నారు. 


కరోనా వ్యాప్తి కారణంగా గత రెండు, మూడు సంవత్సరాలు వెలవెలబోయిన గణపతి విగ్రహాల వ్యాపారం ఈ ఏడాది ఫర్వాలేదనిపిస్తుంది. అయితే ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన పెరగడం, మట్టి విగ్రహాలకు డిమాండ్ పెరగడం పరిణామంగా ప్రకృతి ప్రేమికులు అంటున్నారు.