Vizag News: వైజాగ్‌కు మెట్రో రైలు ఎట్టి పరిస్థితుల్లోనూ తెచ్చి తీరుతామంటున్నారు మంత్రి నారాయణ. ఈరోజు అసెంబ్లీలో వైజాగ్ టిడిపి ఎమ్మెల్యేల నుంచి  ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు స‌మ‌గ్ర ర‌వాణా ప్రణాళిక(సీఎంపి)సిద్దం చేసిన‌ట్లు నారాయణ స్పష్టం చేశారు. ఈ ప్రణాళికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించామ‌ని. కేంద్రం నుంచి అనుమ‌తి రాగానే ప్రాజెక్ట్‌పై ముందుకెళ్తామ‌న్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల స‌మ‌యంలో విశాఖ‌కు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ప‌ల్లా శ్రీనివాస‌రావు, పీజీవీఆర్ నాయుడు, వెల‌గ‌పూడి రామకృష్ణ బాబు అడిగిన ప్రశ్నాలకు మంత్రి స‌మాధాన‌మిచ్చారు.



విభజన చట్టంలోనే వైజాగ్ మెట్రో ప్రతిపాదన
2014 విభ‌జ‌న చ‌ట్టంలోని 13వ షెడ్యూల్ ఐటం 12 ప్రకారం  విజ‌య‌వాడ‌, విశాఖ‌కు మెట్రో రైలు పై ఫీజిబులిటీ రిపోర్ట్ ఇవ్వాల‌ని పొందుప‌రిచారు. దీని ప్రకారం 2014లో డీపీఆర్ సిద్దం చేయాల‌ని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేష‌న్‌కు నాటి టీడీపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. 2015లోనే డీఎంఆర్సీ ఏపీ ప్రభుత్వానికి నివేదికను అందించింది. వైజాగ్‌లో 42.5 కి.మీల నెట్ వ‌ర్క్‌తో మూడు కారిడార్ల‌తో మీడియం మెట్రో ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇచ్చారు. 2019 ఏప్రిల్‌లో టెండ‌ర్లు పిల‌వ‌గా కొన్ని కంపెనీలు బిడ్లు కూడా దాఖ‌లు చేశాయి. అయితే ఆ త‌ర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టెండ‌ర్లు ఖ‌రారు చేయలేదు. విశాఖ‌ప‌ట్నంలో భోగాపురం వ‌ర‌కూ పొడిగింపు సాకుతో ఆ ప్రాజెక్ట్‌ను పెండింగ్‌లో పెట్టేశార‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు. 2020 మార్చి 19న గుర్గాంకు చెందిన వీఎంటీసీ అనే కంపెనీకి విశాఖ మెట్రో డీపీఆర్ బాధ్యతలు అప్పగించగా... మొత్తం 76.9 కి.మీ.తో 14,300 కోట్ల ఖ‌ర్చుతో 4 కారిడార్ల‌లో ఏర్పాటుకు డీపీఆర్ ఇచ్చింద‌న్నారు. 2021 ఏప్రిల్‌లోనే డీపీఆర్ ఇచ్చినప్పటికి 2023 డిసెంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కూ వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేద‌న్నారు నారాయ‌ణ‌.


కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత క‌ల‌క‌త్తా మెట్రో రైల్ మోడల్‌లో వంద‌శాతం కేంద్ర ప్రభుత్వం భ‌రించేలా రైల్వే శాఖ‌కు అప్పగించేలా కేంద్రం ముందు ప్రతిపాదన ఉంచామ‌న్నారు. తాను స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రికి లేఖ ఇవ్వడంతోపాటు సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోడీకి లేఖ రాసార‌ని చెప్పారు. రెండు ద‌శ‌ల్లో నాలుగు కారిడార్ల‌లో మెట్రో ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇచ్చామ‌న్నారు. మొద‌టి ద‌శ‌లో 46.23 కిమీ మేర మూడు కారిడార్ల‌లో నిర్మాణం చేస్తామ‌న్నారు. మొద‌టి కారిడార్‌ను స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్‌ వ‌ర‌కూ 34.4 కిమీ మేర ఉంటుంది. రెండో కారిడార్‌ గురుద్వార నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వ‌ర‌కూ 5.07 కి.మీ. మేర నిర్మిస్తారు. మూడో కారిడార్‌ తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వ‌ర‌కూ 6.75 కి.మీ. మేర ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబోతున్నట్టు ప్రతిపాదనలు సిద్దం చేశారు. మొత్తంగా 46.23 కి.మీ. మేర 42 స్టేష‌న్ల‌తో నిర్మించే ప్రాజెక్ట్ కు 11,498 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. 


Also Read: టీటీఈతో మాట్లాడి టికెట్ లేకుండా రైలు ఎక్కితే జరిమానా ఉండదా?


రెండో ద‌శ‌లో కొమ్మాది జంక్షన్‌ నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ వ‌ర‌కూ 30.67 కిమీ మేర 12 స్టేష‌న్లతో మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేసినట్టు మంత్రి నారాయ‌ణ‌ తెలిపారు. విశాఖ మెట్రో కారిడార్ వెళ్లే మార్గంలో ఎక్కువ క్రాసింగ్స్ ఉండడంతో ట్రాఫిక్ జామ్ కాకుండా కార్ షెడ్, ఎండాడ‌, హ‌నుమంతుని వాక‌, మ‌ద్దిల‌పాలెం,విప్రో జంక్షన్, గురుద్వారా, అక్కయ్యపాలెం, తాటిచెట్లపాలెం, గాజువాక‌, స్టీల్ ప్లాంట్ జంక్షన్ల వ‌ద్ద టూ లెవ‌ల్ మెట్రో, ఫ్లై ఓవ‌ర్‌లు నిర్మించే ప్రతిపాదన చేస్తున్నట్టు మంత్రి నారాయణ స్పష్టం చేశారు.