Vizag YSRCP : విశాఖపట్నం నగరంలోని దస్పల్లా హోటల్లో దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ రెబల్ నాయకులు, కార్య కర్తలు సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ అధ్యక్షత వహించారు. తమతో 12 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి బయటికి వస్తారని ఆయన తెలిపారు. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో అందరూ బయటికి వెళ్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో వైసీపీని ఖాళీ చేస్తామని హెచ్చరించారు. వైసీపీలో కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ అన్నారు. పార్టీ కోసం శక్తివంచన లేకుండా కృషి చేశానని చెప్పారు.                                 


కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా పార్టీలో ముఖ్యనాయకులకు జరిగిన అవమానమే.. తనకు ఎదురైందని సీతంరాజు సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.. అందుకే వైసీపీకి గుడ్‌బై చెబుతున్నట్టు వెల్లడించారు. ఇది చీలిక కాదు పార్టీలో పరిస్థితులపై ఎదురౌతున్న వ్యతిరేకతగా అభివర్ణించారు. విశాఖలో వైసీపీని ఖాళీ చేయడమే లక్ష్యంగా పని చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే పార్టీ వీడిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఇదే విషయం చెప్పారన్నారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ మత్స్యకార, ఎస్సీ ముఖ్య నాయకత్వం సూచనలకు అనుగుణంగా త్వరలోనే భవిష్యత్‌ రాజకీయాలపై నిర్ణయం తీసుకుంటానని  ప్రకటించారు.                    


శాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి చెందిన సీతంరాజు సుధాకర్.. గత డిసెంబర్‌లోనే వైసీపీకి రాజీనామా చేశారు.. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేసిన సుధాకర్‌కు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌తో విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ విషయాలను పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదు.. మద్దతుదారులు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించలేదని.. అందుకే పార్టీని విడిచిపెట్టినట్లు చెప్పారు. సుధాకర్.. ముఖ్యమంత్రి వైఎస్‌కు లేఖ రాశారు. తన పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.


2019 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం సౌత్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వాసుపల్లి గణేష్ కుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలోకి మారారు. ఇటీవల గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన కొందరు కార్పొరేటర్లు వాసుపల్లికి వ్యతిరేకంగా పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. అయితే, కార్పొరేటర్ల నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ, సౌత్ సీటును గెలవగలరని సీఎంను ఒప్పించడంలో వాసుపల్లి విజయం సాధించారని ఎమ్మెల్యే మద్దతుదారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సీతంరాజు సుధాకర్ రాజీనామా చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీ వంశీకృష్ణ.. వైఎస్సార్‌సీపీని వీడి జనసేనలో చేరారు. పెద్ద ఎత్తున వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేస్తూండటంతో వారిని బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగుతున్నారు.