Visakhapatnam Port: విశాఖపట్నం పోర్టు అథారిటీ పరిధిలోని బీవోటి/ పీపీపీ ఆపరేటర్ గా ఉన్న విశాఖ కంటైనర్ టెర్మినల్ లో .. మే నెలలో అత్యధికంగా 61468 టీయూఈ (TUEs) ల కంటైనర్లను హ్యాండిల్ చేసింది. మార్చి 2023లో హ్యాండిల్ చేసిన 56578 టీయూఈల కంటైనర్ల హ్యాండ్లింగ్ మాత్రమే ఇప్పటి వరకు రికార్డుగా ఉంది. విశాఖ కంటైనర్ టెర్మినల్ పొడవు 390 మీ, వెడల్పు 42 మీటర్లు కాగా.. 16 మీటర్ల డ్రాఫ్ట్ ను కలిగి ఉంది. అలాగే మే 2023లో 49 కంటైనర్ నౌకలను హ్యాండిల్ చేయడం ద్వారా విశాఖ కంటైనర్ టెర్మినల్ మరో మైలురాయిని అధిగమించింది. ఒకే నెలలో అత్యధిక కంటైనర్ నౌకలను హ్యాండిల్ చేసిన రికార్డును తిరగ రాసింది.
ఏప్రిల్ 2023లో విశాఖ కంటైనర్ టెర్మినల్ లో 42 కంటైనర్ షిప్పులను హ్యాండిల్ చేసింది. ఇప్పటి వరకు ఇదే ఒక నెలలో అత్యధిక కంటైనర్ నౌకలను హ్యాండిల్ చేసిన రికార్డుగా ఉంది. విశాఖపట్నం పోర్టు నూతన రికార్డులను సాధించటం పట్ల పోర్టు అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు.. పోర్టు సిబ్బందిని, టెర్మినల్ ఆపరేటర్ ను ప్రశంసించారు. పోర్టు సిబ్బంది కలిసికట్టుగా పని చేయటం ద్వారా మరిన్ని కొత్త రికార్డులను తిరగ రాయవచ్చని పోర్టు చైర్మన్ ఈ సందర్భంగా ఉద్యోగులకు సూచించారు.