Vizag News: భారత నౌకాదళ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ విన్యాసాలను విశాఖ మహానగరంలో మిలాన్-2024తో సోమవారం నుంచి నిర్వహించనున్నారు. ఈ నెల 27 వరకు మిలాన్ విన్యాసాలు జరగనున్నాయి. ఈ విన్యాసాలను అద్భుతంగా నిర్వహించేందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం ఇండియన్ నేవీతోపాటు జీవీఎంసీ, జిల్లా యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. మిలాన్ విన్యాసాల్లో 50 దేశాలు పాల్గొననున్నాయి. మిలాన్ వేడుకల్లో పాల్గొంటున్న దేశాల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. మిలాన్ విన్యాసాల్లో అత్యంత కీలకమైన సిటీ పరేడ్ ఈ నెల 22న ఆర్కే బీచ్‌లో నిర్వహించనున్నారు.
మిలాన్-2024 పరేడ్‌కు ముఖ్య అతిథులుగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. మిలాన్-2024 విన్యాసాలను కమరడెరీ(స్నేహం), కొహెషన్(ఐక్యత), కొలాబరేషన్(సహకారం) అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి మిలాన్ వేడుకలు నిర్వహిస్తుంటారు. విశాఖ వేదికగానే 2022లో మిలాన్ విన్యాసాలను నిర్వహించారు. మళ్లీ, రెండేళ్ల తరువాత మిలాన్-2024 నిర్వహిస్తున్నారు. వివిధ దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించేందుకు మిలాన్‌ను నిర్వహిస్తున్నారు.
1955 నుంచి మిలాన్ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. తొలిసారి జరిగిన విన్యాసాల్లో భారత్, ఇండోనేషియా, సింగపూర్, శ్రీలకం, థాయ్‌లాండ్ దేశశాలు పాల్గొన్నాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే మిలాన్‌లో ఏటా దేశాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2005లో సునామీ వల్ల మిలాన్ విన్యాసాలు రద్దు కాగా, 2001, 2016లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలు నిర్వహించడం వల్ల ఈ విన్యాసాలు జరగలేదు. ఈ విన్యాసాల్లో 2010 వరకు ఎనిమిది దేశాలు మాత్రమే పాల్గొనగా.. 2012లో అనూహ్యంగా 16 దేశాలు, 2022లో విశాఖలో నిర్వహించిన విన్యాసాల్లో 35 దేశాలు పాల్గొనగా, ఈ ఏడాది నిర్వహిస్తున్న విన్యాసాల్లో 50కిపైగా దేశాలు పాల్గొంటున్నాయి.
అరవీర భయంకరమైన యుద్ధ నౌకలు
ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు వచ్చిన పలు దేశాలు.. తమ దేశాల్లో అత్యుత్తమ యుద్ధ నౌకలను తీసుకుని వచ్చాయి. ఆయా దేశాల నుంచి వచ్చిన యుద్ధ నౌకలు విశాఖ సముద్ర జలాల్లో కనిపిస్తున్నాయి. భారత్‌తోపాటు యూఎస్, రష్యా, జపాన్, యూకే, ఆస్ర్టేలియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఫ్రాన్స్, ఈజిప్ట్, శ్రీలంక, వియత్నాం, మొజాంబిక్, సూడాన్, ఇజ్రాయిల్, ఖతర్, థాయిలాండ్, మలేషియా, సోమాలియ తదితర దేశాలు ననుంచి యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లు, హెలికాఫ్టర్లు, యుద్ధ విమానాలు చేరుకున్నాయి. ఆయా దేశాలకు సంబంధించి యుద్ధ నౌకల సాగర తీరంలో ప్రదర్శన ఇస్తాయి. యుద్ధ విమానాలు వంటి వాటితో విన్యాసాలు నిర్వహిస్తారు. ఈ విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయనున్నాయి.
మిలాన్ షెడ్యూల్ ఇదీ
ఈ నెల 19 నుంచి 23 వరకు హార్బర్ ఫేజ్ విన్యాసాలు ఉంటాయి. 19న తొలి రోజు ప్రీ సెయిల్ డిస్కషన్స్, టేబుల్ టాప్ ఎక్సర్‌సైజ్ బ్రీఫింగ్స్, అతిథులకు ఐస్ బ్రేకర్ డిన్నర్ ఉంటాయి. 20న హెల్త్ ట్రెక్, ఆగ్రా, తాజ్‌మహల్ సందర్శన, యంగ్ ఆఫీసర్ల ఆత్మీయి కలయిక ఉంటాయి. ఆర్కే బీచ్‌లో సిటీ పరేడ్ రిహాల్సల్స్ నిర్వహిస్తారు. 21న క్రీడా పోటీలు, మేరిటైమ్ టెక్నికల్ ఎక్స్‌పో 2024 ప్రారంభోత్సవం, భారత యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ విజిట్, ద్వైపాక్షిక విన్యాసాలు, వివిధ దేశాల ప్రతినిధుల సిటీ టూర్, మిలాన్ విన్యాసాల ప్రారంభోత్సవం, మిలాన్ విలేజ్ ప్రారంభ కార్యక్రమాలు ఉండనున్నాయి. 22న అంతర్జాతీయ మేరిటైమ్ సెమినార్ ప్రారంభం, ప్రీ సెయిల్ డిస్కషన్స్, సిటీ టూర్, ఆర్కే బీచ్‌లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ నిర్వహించనున్నారు. 23న బుద్దగయ పర్యటన, సిటీ టూర్‌తో హార్మర్ ఫేజ్ విన్యాసాలు, 24 ననుంచి 27 వరకు వివిధ దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, హెలికాఫ్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, సబ్ మెరైన్స్‌తో సీ ఫేజ్ విన్యాసాలు నిర్వహించనున్నారు.