Abdul Kalam View Point:  విశాఖ: ఏపీలోని విశాఖలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న సీత కొండపై ఉన్న వైఎస్ఆర్ వ్యూ పాయింట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సీత కొండలో ఉన్న అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ను తిరిగి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌గా మార్చేశారు. గతంలో ఇది అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ కాగా, వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్ వ్యూ పాయింట్ గా మార్చింది. అయితే ఏపీలో మంగళవారం ఎన్నికల ఫలితాలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకోగా, గెలుపు జోష్ లో ఉన్న కూటమి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వ్యూ పాయింట్‌ వద్ద వైఎస్సార్ పేరు స్థానంలో అబ్దుల్ కలాం పేరు స్టిక్కర్ అతికించారు. గతంలో వైఎస్సార్ వ్యూ పాయింట్ గా పేరు మార్చడాన్ని వ్యతిరేకించిన వాళ్లు ఎన్నికల్లో కూటమి ఘన విజయంతో ఈ పని చేసి ఉంటారు.




ఏపీలోని వైసీపీ ప్రభుత్వం గత ఏడాది సీత కొండ అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ పేరును వైఎస్సార్ వ్యూ పాయింట్ గా మార్చగా, ఆ సమయంలో వివాదం చెలరేగింది. అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు, బీజేపీ నేతలు వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఆయనేమైనా శాశ్వత ముఖ్యమంత్రి అనుకుంటున్నారా, ఏపీలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు, నచ్చిన చోట తమకు కావాల్సినట్లుగా పేర్లు మార్చుతున్నారంటూ అప్పట్లోనే సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.


గతంలో చంద్రబాబు రియాక్షన్ ఇదీ.. 
మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం పేరును తొలగించి వైఎస్సార్ వ్యూ పాయింట్ గా మార్చడం బాధాకరం అని గతంలో చంద్రబాబు అన్నారు. ఆ పేరు తీసేయడం అంటే అబ్దుల్ కలాంను అవమానించడమేనని టీడీపీ అధినేత ట్వీట్ చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. స్టిక్కర్ల ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని, ఏ పని జరిగినా వాటికి సీఎం జగన్ స్టిక్కర్లు వేసుకుంటున్నారంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అదే సమయంలో విమర్శలు గుప్పించారు.


టీడీపీ, బీజేపీ నేతల విమర్శలు, ఆరోపణలపై అప్పటి ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. సీతకొండ వ్యూ పాయింట్ ను డెవలప్ చేసిన అనంతరం, అధికారుల పర్మిషన్‌తో వైఎస్సార్ వ్యూ పాయింట్ గా నామకరణం చేసినట్లు స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి రాజకీయ కారణాలు లేవని పేర్కొంది. గతంలో ఆ ఏరియాను ఎవరూ డెవలప్ చేయలేదని, అక్కడ అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అనే పేరు అధికారంగా పెట్టలేదని ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. అయితే తాజాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఓటమి చెందగా, అదేరోజు వైఎస్సార్ వ్యూ పాయింట్ పేరు అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ గా మార్చడం హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్సార్ వ్యూ పాయింట్ గా మార్చడాన్ని గతంలో వ్యతిరేకించిన కూటమి అభిమానులు తిరిగి అబ్దుల్ కలాం పేరు కనిపించేలా వ్యూ పాయింట్ వద్ద స్టిక్కర్లు అతికించినట్లు తెలుస్తోంది.