ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్2023 సందర్బంగా దేశ విదేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు రానున్న వేళ భద్రత చాలా ముఖ్యం. అందుకే దీని కోసం ఏపీ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో ఇప్పుడు విశాఖ నిఘా నీడలో ఉంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్2023 విశాఖ పోలీసులు తొలిసారిగా స్నిఫర్ డాగ్ టీమ్‌ను సెక్యూరిటీలో వినియోగించనున్నారు. 


ఇప్పటి వరకు విచారణకు మాత్రమే ఉపయోగించే డాగ్‌ స్క్వేడ్‌ను తొలిసారిగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్2023లో వాడుతున్నారు. ఈ స్నిఫర్ డాగ్ టీమ్‌కి ‘కె9 స్క్వాడ్‌’గా పేరు పెట్టి భద్రతలో భాగం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్2023 కోసం భారీగా పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు విశాఖ రానున్న వేళ భద్రత చాలా ముఖ్యం. అందుకే ‘కె9 స్క్వాడ్‌’ను రంగంలోకి దించారు పోలీసులు.  


శునకాలను హ్యాండిల్‌ చేసే హ్యాండ్లర్లకు ప్రత్యేక డ్రెస్ కోడ్ కూడా ఇచ్చారు. 'K9' బృందంలో ప్రస్తుతం లాబ్రడార్, డాబర్ మ్యాన్, జర్మన్ షెపర్డ్ వంటి అత్యున్నతమైన జాతి శునాలు ఉన్నాయి. సిటీలోని  ఏడు ఆడ శునకాలతోపాటు 13 ఈ స్క్వాడ్‌లో ఉన్నాయి. గ్రేసీ, మార్టిన్, రియో, జానీ, రాకీ, యోధా, బ్లాక్కీ, బ్రూటస్, బిట్టు, సీజర్, లక్కీ, రూబీ, జాకీ వాటి పేర్లు. ఇందులో రూబీ మాత్రమే జర్మన్ షెపర్డ్ జాతి చెందింది. జాకీ, సీజర్ డో బెర్మాన్‌ జాతి శునకాలు. మిగిలినవన్నీ లాబ్రడార్లు బ్రీడ్‌కు చెందినవే. వీటితోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా మరో 14 కుక్కలను రప్పించారు పోలీసులు. 


ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి మోడల్ డాగ్ ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు. ‘కె9 స్క్వాడ్’లో మూడు కేటగిరీలు ఉన్నాయి. ఒకటి బాంబ్ డిటెక్షన్ విభాగం, రెండోది ట్రాకర్స్, మూడోది నార్కోటిక్స్. వాసన లేదా స్నిఫ్ చేసే సామర్థ్యం మనిషి కంటే శునకాల్లో 40 రెట్లు మెరుగ్గా ఉంటుంది. అందుకే వీటిని ఈసారి భద్రతలో ప్రధానంగా యూజ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ప్రతి 20 నిమిషాల తర్వాత ప్రతి శునకానికి ఒక పదినిమిషాల రెస్ట్ ఇస్తారు. 


ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు భారీగా సుమారు 40 దేశాల నుంచి ప్రతినిధులతోపాటు, స్వదేశ పారిశ్రామిక దిగ్గజాలు కూడా రానున్నారు. అందుకే విశాఖలో చార్టెడ్‌ ఫ్లైట్లు చక్కర్లు కొట్టనున్నాయి.  విశాఖ ఎయిర్‌పోర్టులో భారీగా చార్టెడ్‌ విమానాలు ల్యాండ్ కానున్నాయి. చార్టెడ్‌ ఫ్లాట్స్‌ ల్యాండింగ్‌కు సంబంధించిన రిక్వస్ట్‌లు  విశాఖ ఎయిర్‌పోర్ట్ అథారిటీకి  చాలానే వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్‌, జీఎంఆర్‌ గ్రూప్‌, జిందాల్‌ స్టీల్స్ అండ్‌ పవర్, అపోలో ఇలా పలు పారిశ్రామిక సంస్థల నుంచి రిక్వస్ట్ వచ్చినట్టు ఎయిర్‌పోర్ట్ అథారిటీ చెప్పింది. 


చార్టెడ్‌ ఫ్లైట్స్‌తోపాటు అదనంగా మరో 31 వాణిజ్య విమానాలు కూడా ఇక్కడి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. గంటకు సుమారు పది విమానాల రాకపోకలను హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు రోజుల పాటు ఈ హడావుడి ఉంటుందని భావిస్తున్నారు.   దీని కోసం పదహారు పార్కింగ్ బేస్ సిద్దం చేశారు. ఇందులో 12 కొత్తవికాగా...4 పాతవి. ఇవి ఎయిర్‌బస్‌ 777, ఎయిర్‌ బస్‌ A320, బోయింగ్‌ 747, ఏటీఆర్‌, చోపర్స్‌కు సరిపోనున్నాయి. 


విమానాల ల్యాండింగ్ కోసం 11 వందల అడుగుల రన్‌వే సిద్ధంగా ఉంది. ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్‌ను ఇండియన్ నేవీ చూస్తోంది. పార్కింగ్‌, ప్రయాణికుల రాకపోకల అంశాన్ని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ చూసుకోనుంది.