Two prisoners escape from Chodavaram sub jail: అనకాపల్లి జిల్లాలోని చోడవరం సబ్‌జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో హెడ్‌వార్డర్‌పై సుత్తితో దాడి చేశారు. పరారైన ఖైదీలను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
చోడవరం సబ్‌జైలులో వంట పనుల కోసం ఖైదీలను బయటకు తీసుకువచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాడుగుల చోరీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బెజవాడ రాము, హెడ్‌వార్డర్ రాజుపై సుత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో హెడ్‌వార్డర్ తలకు గాయమైంది, దీంతో అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాడి అనంతరం, బెజవాడ రాము హెడ్‌వార్డర్ వద్ద ఉన్న తాళాల గుత్తిని లాక్కొని, జైలు ప్రధాన ద్వారం లాక్‌ను తెరిచి పరారయ్యాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, ఫించను డబ్బు కాజేసిన కేసులో రిమాండ్‌లో ఉన్న మరో ఖైదీ, పంచాయతీ మాజీ కార్యదర్శి నక్కా రవికుమార్ కూడా జైలు నుంచి పారిపోయాడు.
ఈ ఘటనపై స్పందించిన అనకాపల్లి జిల్లా పోలీసులు, పరారైన ఖైదీల కోసం విస్తృత గాలింపు చర్యలు ప్రారంభించారు. సమీప ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ, ఖైదీల సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ ఘటన జైలు భద్రతా వ్యవస్థలలో లోపాలను బయటపెట్టిందని, దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
చోడవరం సబ్‌జైలు రిమాండ్ జైలుగా పనిచేస్తుంది, ఇక్కడ సాధారణంగా చిన్న నేరాలకు సంబంధించిన ఖైదీలను ఉంచుతారు. ఇలా పారిపోయి.. ఎన్ని రోజులు బయట ఉంటారని.. ఇవాళో రేపో పోలీసులకు దొరుకుతారని.. తర్వాత వారి పరిస్థితేమిటన్న సందేహాన్ని ఈ దృశ్యాలు చూసిన పలువురు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.