శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రజలను పులి టెన్షన్ పెడుతోంది. పశువులపై దాడి చేస్తూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రెండు రోజులు సైలెంట్‌గా ఉన్న పులి ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. కంచిలి, సోంపేట, కవిటి మండలాల ప్రజలను పరుగులు పెట్టిస్తోంది. ఏ క్షణంలో ఎటు నుంచి పులి దాడి చేస్తుందో అన్న భయం ప్రజల్లో కనిపిస్తోంది.
తాజాగా రాత్రి కంచిలి మండలంలోని మండపల్లి గ్రామంలో వీరవిహారం చేసింది. మాదిన హరిబాబుకు పెంచుకునే ఆవు,దూడపై పంజా విసిరింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత గ్రామంలోని హరిబాబుకు చెందిన ఆవు, దూడలపై పెద్దపులి తీవ్రంగా దాడి చేసిహతమార్చింది. దూడను క్రూరంగా చంపిన పులి సమీపంలోని పంట పొలాల్లోకి ఈడ్చుకు వెళ్ళింది.
పాలు కోసం ఉదయాన్నే తోటకు వచ్చిన హరిబాబు అక్కడ పరిస్థితి చూసి హతాశులయ్యారు. ఈ సీన్ చూసిన గ్రామస్థులు, తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలంతా హడలెత్తిపోతున్నారు. పెద్దపులి సంచారంతో కంటిమీద కునుకు లేకుండా పోతుందని ప్రజలు వాపోతున్నారు. ఆవుదూడపై దాడితో మరింత కలవరపడుతున్నారు.
నిన్న మొన్నటి వరకు ఇచ్ఛాపురం మండలంలో తిరుగుతుందని అంతా భావించారు. అటు నుంచి ఒడిశా అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతోందని అంచనా వేశారు. అటవీ అధికారులు కూడా ప్రజలకు ఇదే చెప్పారు. కానీ పులి అనూహ్యంగా యూ టర్న్ తీసుకుంది. కంచిలి మండలంలో ప్రత్యక్షమైంది.
కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మండలంలో గత వారంరోజులుగా పాదముద్రలను మాత్రమే కనిపించాయి. ఇప్పుడు ఏకంగా పశువులపై దాడి చేసింది. రక్తం రుచి మరిగిన పులి ఇప్పుడు ఎటు నుంచి మీద పడుతుందో అన్న కంగారు మాత్రం ప్రజల్లో కనిపిస్తోంది. పొలాలకు, తోటలకు వెళ్లడం కష్టమే అంటున్నారు స్థానిక ప్రజలు.
పులి పాదముద్రలు గుర్తింపు..
శ్రీకాకుళం జిల్లాలో పులి సంచారంపై డీఆర్ఓ నిషాకుమారి మూడు రోజుల క్రితం స్పందించారు. జిల్లాలోని అమ్మవారిపుట్టుగులోని మండపల్లి పంచాయతీలో టైగర్ పాదముద్రలు గుర్తించామని తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో పులి సంచారం ఉందని వెల్లడించారు. పులి తిరుగున్నట్లు అక్టోబర్ 25న అటవీశాఖ అధికారులు గుర్తించారు. అప్పటినుంచి పులి జాడ కోసం అధికారులు చర్యలు తీసుకున్నారు. పులి సంచరిస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏవైనా అనుమానాస్పద గుర్తులు కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఏమైనా పెంపుడు జంతువులపై పులి దాడి చేసి చంపేస్తే ప్రభుత్వం చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు. పులి సంచారంపై సమీప గ్రామాల్లో సంబంధిత అధికారులను అప్రమత్తం చేశామన్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అక్టోబర్ 21 నుంచి పులి సంచారాన్ని ఒడిశా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఏఓబీ బార్డర్ లో పులి సంచరిస్తుండటంతో రెండు రాష్ట్రాల అధికారులు పులిని ట్రాప్ చేయడం కోసం చర్యలు చేపట్టారు. ముఖ్యంగా శ్రీకాకుళంలోని ఉద్దానం, మండపల్లి, అమ్మవారిపుట్టగ, బంజిరినారాయణపురం, మెళియాపుట్టి మండలంలోని గొప్పిలి, గోకర్ణపురం, చిన్నహంస, భరణికోట, కొలిగాం ప్రాంతాల్లో పులి సంచరిస్తుంది. జీడి మామిడి తోటలు ఎక్కువగా ఉన్న చోట పులి పాద ముద్రలు గుర్తించారు. ఎలుగుబంట్లు కూడా ఈ ప్రాంతాల్లో తరచుగా స్థానికులకు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. పంట పొలాల్లో పులి ఆనవాళ్లు అటవీశాఖ గుర్తించి స్థానికులకు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు.