వైజాగ్‌లో టెర్రస్ ఫుట్ బాల్ ఆటకు క్రేజ్ పెరుగుతుంది. తమ పిల్లలు కాలుష్యానికి దూరంగా ఉంటూనే ఆటలలో రాణించాలనుకు తల్లిదండ్రులు ఈ మేడపై ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. విశాఖపట్నం నడిబొడ్డున సిరిపురం జంక్షన్ వద్ద ఉన్న ఒక పెద్ద మాల్‌పైన ఏకంగా ఐదవ ఫ్లోర్‌లో ఉందీ టెర్రస్‌ గ్రౌండ్‌.

 

ఈ టెర్రస్ పైన ఫుట్‌బాల్ ఆడేస్తున్నారు పిల్లలు. ఇటీవల ఇండియాలోనూ క్రేజ్ పెంచుకుంటున్న ఫుట్ బాల్ ఆటలో రాణించాలనుకునే పిల్లలకు.. ఈ టెర్రస్ ఫుట్ బాల్ ఒక  ఆప్షన్‌గా మారింది. రోజురోజుకీ నగరాల్లో కరవైపోతున్న క్రీడా స్థలాలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాడుతున్నాయీ టెర్రస్‌ గ్రౌండ్‌లు. ఉన్న కొద్దీ స్థలంలోనే ఫుట్ బాల్ లాంటి క్రీడలకు ఒక వేదికగా మారింది ఈ టెర్రస్ ఫుట్ బాల్.

 

వైజాగ్‌కు చెందిన దత్తా, శివమ్, అనుదీప్ ఈ ఆలోచనకు నాంది పలికారు. దానికనుగుణంగా 5 అంతస్తుల భవనంపై 35x15 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కృత్రిమ గడ్డి , రబ్బరు,ఫైబర్‌తో గ్రౌండ్  ఏర్పాటు చేశారు. దీనిపై ఫుట్ బాల్‌లో భాగమైన 5 ఏ సైడ్ ఆటను పిల్లలు ఆడేస్తున్నారు . దీనివల్ల గ్రౌండ్‌లో ఆడిన అనుభూతి ఆటగాళ్లకు వస్తుందనిపైగా దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉండవని కోచ్ నరేష్ చెబుతున్నారు. 

 

అనుభూతి కోసం మాత్రమే కాదు

 

కేవలం ఒక ఎక్స్ పీరియన్స్ కోసం మాత్రమే కాకుండా అఫీషియల్ గేమ్స్ సైతం ఇక్కడ నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఫుట్ బాల్ దే భవిష్యత్తు అని అందుకే ఈ టెర్రస్ ఫుట్ బాల్ లో ట్రైనింగ్ అవుతున్నామని పిల్లలు చెబుతున్నారు. అధికారిక  గుర్తింపు కలిగిన ఫుట్ బాల్ క్రీడాకారులుగా ఎదగడమే తమ లక్ష్యమని దానికి ఈ టెర్రస్ ఫుట్ బాల్ ఎంతో ఉపయోగపడుతుంది అని వారు అంటున్నారు. 

 

తప్పని మార్పులు అంటున్న పేరెంట్స్ 

 

కార్పొరేట్ యుగంలో పిల్లలకు స్కూళ్ల లో ప్లే గ్రౌండ్ లో లభించడం లేదని అందుకే ఇలాంటి వేరే ప్రత్యామ్నాయాల వైపు చూడాల్సి వస్తుందని అంటున్నారు తల్లిదండ్రులు. పైగా ఫుట్ బాల్ వల్ల పిల్లలకు నైపుణ్యం మాత్రమే కాకుండా శరీరానికి తగిన ఎక్సెర్ సైజ్ కూడా బాగా లభిస్తుందని అందుకే టెర్రస్ ఫుట్ బాల్ లో చేర్పించామని వారు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఆటలు మరిన్ని పుట్టుకు వస్తాయని పేరెంట్స్ అంటున్నారు.

 

ఏదేమైనా కొత్త తరహా ఆలోచనలకు ఎప్పుడూ ఆహ్వానం పలికే వైజాగ్ లో లేటెస్ట్ స్పోర్ట్ సెన్సేషన్ గా మారింది ఈ టెర్రస్ ఫుట్ బాల్