Vangalapudi Anitha: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భయానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నారని.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం జగన్ ప్రతిపక్షాలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. తాము ఓడిపోతామన్న భయంతోనే ప్రతిపక్ష నాయకులు జనంలోకి వెళ్లకుండా తీవ్ర ఆంక్షలు పెడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ జనాల్లోకి వెళ్లడానికి భయపడి పరదాల చాటున సభలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం సభల్లో నల్లరంగు, పసుపు రంగు కనపడకూడదని అంటున్నారని.. ఎందుకు ఇంత భయపడుతున్నారని ప్రశ్నించారు. తన సభలకు బెదిరించి జన సమీకరణ చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అది వైసీపీ కుట్రే!
తమ నాయకుడు చంద్రబాబు సభలో కందుకూరు ఘటన జరగడం దురదృష్టకరమని అనిత అన్నారు. అయితే గుంటూరులో జరిగినది మాత్రం వైసీపీ కుట్రలాగే కనిపిస్తోందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించకూడదని జీవో ఇచ్చిన మరుసటిరోజే.. సీఎం రాజమండ్రిలో ఇరుకు సందులో రోడ్ షో చేయవచ్చా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి సలహాదారులు అర్ధంపర్ధం లేని సలహాలు ఇస్తున్నారని అన్నారు.
అప్పుడు లేనిది ఇప్పుడెందుకు
జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి ఐదుగురు చనిపోయారు. అప్పుడు మద్యం నిషేధించారా? కచ్చులూరులో బోటు ప్రమాదంలో ప్రయాణికులు మరణించారు. అప్పుడు పర్యటక ప్రయాణాలు నిలిపివేశారా? మరి ఒక సభలో ప్రమాద ఘటన జరిగిందని సభలకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? అంటే సీఎం జగన్ భయపడుతున్నారు. అందుకు కుప్పంలో జరిగిన పోలీస్ చర్యలే నిదర్శనం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సభలు జరపడానికి, టీడీపీ నేతలను అరెస్ట్ చేయడానికే పోలీసులు పనిచేస్తున్నట్లుంది. అని అనిత వ్యాఖ్యానించారు.
ఈ సమావేశంలో విశాఖ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత, కార్యదర్శి నక్క పద్మ తదితరులు పాల్గొన్నారు,
జగన్ రెడ్డికి ఓడిపోతామనే భయం పట్టుకుంది: చంద్రబాబు
తెలుగుదేశం సభలకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుండటంతో జగన్ కు ఓడిపోతామనే భయం పట్టుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. త్వరలో జగన్ శకం ముగుస్తుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. ఇప్పుడు జగన్ చేస్తున్నట్టుగానే గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుంటే జగన్ పాదయాత్ర చేయగలిగేవాడా అని ప్రశ్నించారు. పోలీసులు చట్టపరిధిలో విధులు నిర్వర్తించాలి కానీ ఏ పార్టీకి కొమ్ము కాయొద్దని సూచించారు. కుప్పంలోకి ఎందుకు రానివ్వలేదో లేఖ ఇవ్వాలని పోలీసులను కోరారు. ఏ చట్టం ప్రకారం జీవో నెంబర్ 1 తీసుకువచ్చారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మినహాయించబడిందని 1946 సవరణలో దాని ప్రస్తావన లేదని గుర్తు చేశారు. దీనిపై జగన్ సమాధానం చెప్పాలన్నారు.