ప్రజాదరణ పెరుగుతున్న పాదయాత్ర నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర ఇంచార్జ్ బుద్ధా వెంకన్న అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకుంది అన్నారు. అప్పట్లో ప్రతిపక్షనేతగా జగన్ చేసిన పాదయాత్ర మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ గా ఉండేది అని ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్రతో భారత దేశంలో చరిత్ర సృష్టించనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. 


వైసీపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్న కులాలను లోకేష్ కలుస్తున్నారు. అట్టడుగు వర్గాలు ఏదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు లోకేష్ పాదయాత్రను చిన్నచూపు చూశారు. కానీ యువగళం పాదయాత్రకు రోజురోజుకూ జనాదరణ పెరుగుతుందని బుద్ధా వెంకన్న అన్నారు. అది చూసి వైసీపీ నేతల కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. పాదయాత్రలో లోకేష్ అడుగులు వేస్తుంటే జగన్ గుండెల్లో పిడుగులు పడుతున్నాయి అని వ్యాఖ్యానించారు. లోకేష్ పాదయాత్ర ఎక్కడా విరామం లేకుండా కొనసాగుతోంది అన్నారు. జగన్ పాదయాత్రలో రెండు రోజులు సెలవులు కూడా ఉండేవి అని సెటైర్లు వేశారు.
బాబు తరువాత నాయకుడు లోకేష్..
చంద్రబాబు తర్వాత లోకేష్ టీడీపీ నాయకుడు అని యువగళం పాదయాత్రతో నిరీపించుకున్నారు. జగన్ పిచ్చి పరాకాష్టకు చేరింది అని కీలక వ్యాఖ్యలు చేవారు. వైస్సార్ అధికారంలో ఉన్నప్పుడు లంచాలు తీసుకుని లక్షల కోట్లు సంపాదించారు, కానీ చంద్రబాబు అద్దెకు ఉండే ఇంటికి నోటీసులా అని సీఎం జగన్ ను బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటిని టచ్ చేసి చూడు.. జగన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమికొడతాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ విశాఖ వస్తానని అంటుంటే పరిపాలనకు అనుకున్నాం, జగన్ నిన్న చేసిన పిచ్చి చేష్టలతో అసలు నిజం మాకు తెలిసింది పిచ్చి కుదుర్చుకునేందుకే జగన్ విశాఖ వస్తున్నాడు అన్నారు.  
త్వరలో రాక్షస సంహారం జరుగుతోంది.. 
మంత్రి గుడివాడ అమర్నాథ్ జేబులో రెండు జెండాలు పెట్టుకుని తిరుగుతాడు. వైసీపీ పార్టీలో ఉన్న కాంగ్రెస్ నేతలు అప్పుడు అమర్ ను, ఆమె తల్లిని కాంగ్రెస్ నుంచి తరిమేశారంటూ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. అపుడు ఇద్దరిని టీడీపీ ఆదరించిందన్నారు. కాపులకు పవన్ కళ్యాణ్ ప్రతినిధి. ఈసారి గుడివాడ అమర్నాథ్ కు కాపులే బుద్ధి చెపుతారు అన్నారు. జనేసన అధ్యక్షుడు 
పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అనకాపల్లి సెంటర్ లో అమర్నాథ్ నిల్చుంటే ప్యాంట్ షర్ట్ విప్పుతారని, ఆయన వన్ టైం ఎమ్మెల్యే అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. 


వంద రోజులు పూర్తి చేసుకున్న యువగళం
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వందోరోజులు పూర్తి చేసుకుంది. యువగళం పాదయాత్రకు 100 రోజులతోపాటు 1200 కిలోమీటర్ల మైలురాయిని కూడా దాటబోతోంది. ప్రస్తుతం నంద్యాలలో ఉన్న పాదయాత్ర చేస్తున్నారు. అక్కడే వందరోజుల వేడుక నిర్వహించనున్నారు.  జనవరి 27న లోకేష్ తన పాదయాత్ర కుప్పం నుంచి మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 34 నియోజకవర్గాలను కవర్ చేస్తూ సాగిందీ యాత్ర. మొత్తం 1269 కిలోమీటర్లు మేర నడిచారు లోకేష్‌.  ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ సాగుతున్నారు.