రాష్ట్రంలో మంగళవారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు చెప్పారు.
సోమవారం అక్కడ రికార్డ్ ఉష్ణోగ్రతలు..
 నెల్లూరు జిల్లా కొండాపురంలో 46.4°Cలు, ప్రకాశం జిల్లా జరుగుమిల్లిలో 46.2°Cలు, కృష్ణా జిల్లా కోడూరులో 46°Cలు  అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెల్లడించారు. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రేపు కూడా ఎండల అలర్ట్...
మంగళవారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం తొమ్మిది మండలాల్లో ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల, కొల్లిపర, మంగళగిరి,పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ, తుళ్ళూరు, కృష్ణా జిల్లా పెనమలూరు మండలం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో తీవ్రవడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. 
వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(194)  
అల్లూరి జిల్లా 5, బాపట్ల 18, తూర్పుగోదావరి 19,  ఏలూరు 28, గుంటూరు 8, కాకినాడ 8,  కోనసీమ 9, కృష్ణా 15, ఎన్టీఆర్ 14, పల్నాడు 23, మన్యం 8, ప్రకాశం 6, శ్రీకాకుళం 1, నెల్లూరు 7, విజయనగరం 2, పశ్చిమగోదావరి జిల్లాలోని 11, వైఎస్సార్ 12 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.
రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 48°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.శ్రీసత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. సోమవారం  18 మండలాల్లో తీవ్రవడగాల్పులు , 131 మండలాల్లో వడగాల్పులు వడగాల్పులు వీచాయని ఆయన వెల్లడించారు.
భారీగా వడగాల్పులు...
వేసవి సీజన్ ఆరంభంలో వాతావరణం కాస్త ఊరట ఇచ్చింది. తుఫాన్ ప్రభావంతో వాతావరణం పూర్తిగా అనుకూలించింది. అయితే ఆ తరువాత నుండి భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. భానుడి ఉగ్రరూపానికి తోడుగా మరో వైపున ఈదురు గాల్పులు, వేడి గాల్పులు కూడా తోడవుతున్నాయి. దీంతో రహాదారు పై రాకపోకలు సాగించే వారికి శరీరం మంటెత్తిపోతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వేసవి సీజన్ లో భానుడి ప్రతాపం మాత్రం సామాన్యడికి చుక్కలు చూపిస్తోంది. అధిక పగటి ఉష్ణోగ్రతలు, ఎండల కారణంగా 50, 60 ఏళ్లు దాటిన వారు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. నడివయస్సులో ఉన్న వారుసైతం ఎండలో రాకపోకలు సాగించాలంటే, నీరసించిపోవాల్సిందే. తప్పని పరిస్దితుల్లో బయటకు వచ్చి పనులు ముగించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నారు.
ఈ నెల 25 నుంచి రోహిణి కార్తె..
వేసవిలో అసలైన సీజన్ రాబోతోంది. ఈనెల 25వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు రోహిణి కార్తె దంచికొట్టేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే వాతావరణం ఇలా ఉంటే, ఇక రోహిణి కార్తె సమయంలో ఎలాంటి పరిస్దితులు ఉంటాయన్న దానిపై సామాన్యుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.