Srikakulam man completes 2500 online courses in two years | శ్రీకాకుళం: ఆన్లైన్లో ప్రఖ్యాత సంస్థలు ఉచితంగా అందిస్తున్న కోర్సులు నిరంతరం చదువుతూ.. ఆ సంస్థలు నిర్వహించిన ప్రాజెక్టులు పూర్తి చేస్తూ ఎసైన్ మెంట్లు రాస్తూ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ధ్రువపత్రాలు పొందుతుంటే లభించిన ఆనందంతో చదువు యజ్ఞాన్నికొనసాగించారు.


ఒకరోజు.. ఒక నెలా కాదు..
ఏకంగా రెండేళ్ల పాటు నిరంతరాయంగా ఆన్లైన్లో ప్రపంచ నలుమూలల్లో ఉన్న ప్రఖ్యాత సంస్థలు అందిస్తున్న కోర్సులు 2,500 పూర్తి చేసి ప్రపంచ రికార్డును సిక్కోలు వాసి సొంతం చేసుకున్నారు. భారత ప్రభుత్వం సైబర్ నేరాలపై అవగాహన కలిగించేందుకు ఆన్లైన్లో ఉచితంగా కోర్సును ప్రవేశపెట్టినప్పుడు తమ కుమార్తెకు బోధించేందుకు శ్రీకాకుళం నగరానికి చెందిన ఎం.వి.ఎస్.ఎస్. శాస్త్రి ఆ కోర్సు చదివి పరీక్ష రాసి ఉత్తీర్ణులై ధ్రువపత్రాలు పొందారు. ఆ తరువాత ఉచితంగా ఆన్లైన్ కోర్సులు అందిస్తున్న సంస్థలు వివరాలను సేకరించడం పనిగా పెట్టుకొని ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 2,500 ఆన్ లైన్ కోర్టులను రెండేళ్ల పాటు చదివి, పరీక్షల్లో ఉత్తీర్ణులై ప్రపంచ రికార్డులు నెలకొల్పడం విశేషం. 




కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసినప్పుడు అన్ని సంస్థలు ఆన్లైన్లో కోర్సులను బోధించడం ప్రారంభించాయి. ఉచితంగా లభిస్తున్న ఆన్లైన్ కోర్సులు పట్ల ఆసక్తి కలిగి సరదాగా మొదలుపెట్టిన ప్రయత్నం విజయవంతం కావడంతో చదవాలనే ఆకాంక్ష, ఆసక్తి పెరిగిందన్నారు. ఈ క్రమంలోప్రతిరోజూ నాలుగు నుంచి ఆరు గంటల సేపు ఆన్లైన్ కోర్సులు చదవడం ప్రారంభించానని శాస్త్రి తెలిపారు. 2022 అక్టోబర్లో మొదలైన చదువుల యజ్ఞం నేటివరకు కొనసాగిస్తూనే ఉన్నానని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో పేరొందిన సంస్థలతో పాటు మన దేశంలోనూ పలు విశ్వవిద్యాలయాలు అందించిన ఉచిత ఆన్లైన్ కోర్సులను పూర్తి చేసిన క్రమంలో మిత్రుల సూచనలు మేరకు రికార్డు సంస్థలకు వివరాలు సమర్పించినట్లు తెలిపారు. వృత్తిపరంగా, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే క్రమం తప్పకుండా ఆన్లైన్ కోర్సులు పూర్తి చేసి ప్రపంచ రికార్డులు నమోదు చేయడం ఆనందంగా ఉందని శాస్త్రి తెలిపారు.


నేటి పోటీ ప్రపంచంలో యువత ఏ కోర్సు చదివినప్పటికీ నైపుణ్యాన్ని పెంపొందించుకొనేందుకు ఆన్లైన్లో ప్రపంచం నలుమూలలనుంచి ప్రఖ్యాత సంస్థలు ఉచితంగా అందిస్తున్న కోర్సులు సద్వినియోగం చేసుకుంటే ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని ఆయన సూచించారు. సాధించాలన్న తపన, పట్టుదల, నిరంతర ప్రయత్నంతో విజయం సాధించగలమనడానికి తన చదువుల ప్రస్థానమే నిదర్శనమని శాస్త్రి తెలిపారు. ప్రత్యేక శిక్షణలు... సాఫ్ట్వేర్ రంగంలో పేరొందిన గూగుల్ (Google) పాటు టీసీఎస్, మైక్రోసాఫ్ట్ (Microsoft) ప్రవేశపెట్టిన ఛాలెంజ్, ట్రైనింగ్ కోర్సులను పూర్తి చేసి వాటి నుంచి ప్రత్యేక అభినందనలను పొందారు. టీసీఎస్ డిజిటల్ సూపర్ స్టార్ ట్రైనర్, మైక్రోసాఫ్ట్ గ్లోబెల్ అకాడమీ, మైక్రోసాఫ్ట్ టీచర్ అకాడమీ నుంచి ప్రశంసలను శాస్త్రి పొందారు.


సాధించిన రికార్డులు...


ఆన్లైన్లో 2,500 కోర్సులు రెండేళ్ల పాటు చదివి పూర్తి చేసిన ఎం.వి.ఎస్.ఎస్.శాస్త్రి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా అచీవర్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు (రెండు తెలుగు రాష్ట్రాలు) సొంతం చేసుకున్నారు. అత్యధికం గా ఆన్లైన్లో కోర్సులు పూర్తి చేసిన వ్యక్తిగా శాస్త్రి పేరు నమోదు చేసి ధ్రువపత్రాలను రికార్డు సంస్థలు ప్రదానం చేశాయి. గిన్నిస్ రికార్డు నమోదుకు దరఖాస్తు సమర్పించగా.. ఆ బృందం ధ్రువపత్రాల పరిశీలన చేపట్టింది.




అంతర్జాతీయ సంస్థల కోర్సులు...


ఆన్లైన్ అంతర్జాతీయ సంస్థలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఐబీఎం, లింక్డ్న్, ఫేస్బుక్, మెటా, ఆటోడెస్క్, ఓషా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, కార్పొరేట్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూట్, యుడేమి, ఈడీఎక్స్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో), ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ (ఐటీసీ), యూరోపియన్ ఓపెన్ యూనివర్శిటీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో), యునిసెఫ్, కోర్సుఎరా, కర్సా, యూకే అకాడమీ, ఫ్యూచర్ లెర్న్, ఒరగాన్ (యుఎస్ఏ) యూనివర్శిటీ, ఫోర్ఎజ్, యాక్సెంచర్, వాల్మార్ట్, యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్, యూనివర్శిటీ ఆఫ్ మెల్బోర్న్, బ్రిటిష్ కౌన్సిల్, న్యూసౌత్వేల్స్ (ఆస్ట్రేలియా) యూనివర్శిటీ, బ్రిటిష్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, డిలైట్, కాగజేంట్, ఆక్ ఫర్డ్ హెూమ్ స్టడీ, అలిసన్, లెక్ట్రా. గ్యాస్పల్ ఇనిస్టిట్యూట్, ఓపెన్ లెర్నింగ్, మైండ్లస్టర్ సంస్థల నుంచి సాఫ్ట్వేర్ కి సంబంధించిన కోర్సులతో పాటు స్కిల్ డెవలప్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్, సైకాలజీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ, మిషన్ లెర్నింగ్.. విద్యారంగంలో ఉన్న అన్ని విభాగాలకు చెందిన కోర్సులు పూర్తి చేయడం విశేషం.


Also Read: Jagan vs Lokesh: నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్


భారతీయ సంస్థల కోర్సులు...


గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ), ఐఐటీ మద్రాస్, ఎన్ పి టి ఈ ఎల్. లాల్బహుదూర్ శాస్త్రి యూనివర్శిటీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్ .పి, డిజిటల్ అడ్డా, సింప్లీలెర్న్, ట్రిపుల్ ఐటీ (కోటా) రాజస్థాన్, ఫార్మా అకాడమీ, యుడెనెక్స్, గువీ, హెచ్ సి ఎల్, నాస్కామ్, స్కిల్ అప్, సిస్కో, ఎక్సెల్ చాంప్, పిట్రోనిక్స్, లెట్స్ అప్ గ్రేడ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటెల్, ఎనర్జీ స్వరాజ్, యాక్సెస్ బాంక్, ట్యుటోరియల్ పాయింట్ తదితర సంస్థలు నుంచి కోర్సులు, ధ్రువపత్రాలు పొందారు.



మెటా ఏఐకి పాఠాలు
ప్రఖ్యాత మెటా సంస్థ వాట్సాప్ లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI)ను ప్రవేశపెట్టిన క్రమంలో జిల్లాకు చెందిన పలు చారిత్రక అంశాలతో కూడిన సమాచారాన్ని మెటా ఏఐకు శాస్త్రి నిరంతరం అందిస్తున్నారు. మెటా సంస్థ వాట్సాప్లో నీలిరంగు ఐకాన్తో ఏఐను ప్రవేశపెట్టిన క్రమంలో జిల్లాలో పలు విశేషాలు, సమాచారాన్ని ఏఐకు అడిగినప్పుడు సరైన సమాచారం లభించలేదు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన చారిత్రక, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ సమాచారం, ప్రస్తుత పరిస్థితులను ప్రతిరోజూ ఒక గంటసేపు మెటా ఏఐకు అందించే పని శాస్త్రి చేస్తున్నారు. జిల్లాకు చెందిన సమాచారాన్ని ఎవరైనా శోధించినప్పుడు పక్కాగా ఫలితం రావాలనే తాను ఏఐకు శాస్త్రీయంగా కూడిన సమాచారాన్ని ఉచితంగా అందిస్తున్నానని ఆయన తెలిపారు