ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. స్పందన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని ప్రభుత్వం పదే పదే చెబుతూ వస్తుంది. స్పందన కార్యక్రమానికి అధికారులందరూ కూడా తప్పనిసరిగా హాజరుకావాలని కూడా స్పష్టం చేస్తుంది. అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి అధికారులపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ కన్నెర్ర చేశారు. 


స్పందన కార్యక్రమానికి హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సీరియస్ అయ్యారు. స్పందనకు హాజరుకాని ముగ్గురు జిల్లా అధికారులకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమానికి డ్వామా పి.డి, మత్స్యశాఖ జె.డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జిల్లా అధికారులు హాజరుకాకపోవడంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని కలెక్టర్ చెప్పారు. 


జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌తోపాటు జిల్లా అధికారులు అంతా హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి వ్యక్తిగత సమస్యలు, సామాజిక సమస్యలు పరిష్కారం కోరుతూ వచ్చే అర్జీదారుల నుంచి కలెక్టర్ వినతులను స్వీకరించారు. తక్షణం వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు. 65 వినతులు రీ ఓపెన్‌లో ఉన్నాయని వాటిలో రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ, సమగ్ర శిక్ష, మున్సిపల్ కార్పొరేషన్, ఎక్సెజ్, పోలీసు శాఖ తదితర శాఖల్లో పెండింగ్ ఉన్నాయని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. 


స్పందన పోర్టల్ లో పెండింగ్‌లో ఏమీ లేవని ఇదే పద్దతి కొనసాగించాలన్నారు కలెక్టర్‌ లాఠకర్‌. విద్యా శాఖ, సమగ్ర శిక్ష, గురుకులాలకు సంబంధించి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం, పంచాయతీ రాజ్, గృహ నిర్మాణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, ఇరిగేషన్, తదితర శాఖల సమస్యలుపై 379 అర్జీలు స్వీకరించారు. అర్జీదారులతో జిల్లా అధికారులు మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు హామినిచ్చారు. జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలి


జిల్లా అధికారులంతా కూడా స్పందన కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలని చెబుతున్నారు. స్పందన ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించేందుకు వారు చొరవ తీసుకోవాలని పేర్కొంటునే ఉన్నారు. అయితే కొందరు అధికారులు గైర్హాజరవుతున్నారు. అలాగే డ్వామా పి.డి, మత్స్యశాఖ జె.డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జిల్లా అధికారులు సోమవారం స్పందన కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో మండి పడ్డారు. ఇకపై అధికారులు స్పందనకు రాని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. షోకాజ్ నోటీసుల వ్యవహారం జిల్లా అధికారులలో చర్చనీయాంశమైంది.