విశాఖపట్నంలోని సింహాచలం కొండపై జరుగుతున్న అప్పన్న స్వామి చందనోత్సవంలో భక్తులకు విపరీతమైన కష్టాలు ఎదురవుతున్నాయి. సింహాచలం కొండపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఎండలో అవస్థలు పడుతున్నారు. పదుల సంఖ్యలో బస్సులు నిలిచిపోయి, ట్రాఫిక్ ముందుకు కదలకపోవడంతో భక్తులు అసహనానికి లోనవుతున్నారు. కొంత మంది భక్తులు బస్సులు దిగి ఘాట్ రోడ్డులో నడిచి వెళ్తున్నారు. దేవస్థానం అధికారులు ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేయలేదని, సిబ్బంది నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే అప్పన్న స్వామివారు నిజరూపంలో దర్శనం ఇస్తారు. ఇది చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
మరోవైపు, సింహాద్రి అప్పన్న ప్రొటోకాల్ దర్శనాలు కూడా గందరగోళంగా మారాయి. ఒకేసారి వీఐపీలు రావడంతో భారీ తోపులాట జరిగింది. మేయర్, జడ్జిలు, ఇతర రాజకీయ ప్రముఖులు క్యూలెన్లలో నిలిచిపోయారు. సింహాచలం చందనోత్సవంలో వీవీఐపీల గందరగోళం నెలకొంది. ప్రోటోకాల్ దర్శనాల్లో అడుగడుగునా వైఫల్యం బయటపడినట్లు తెలుస్తోంది. ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. మరో వైపు ట్రస్ట్ బోర్డు సభ్యుల అసంతృప్తి కూడా బయటపడింది. గందరగోళంగా మారిన దర్శనాల కారణంగా కనీస మర్యాద లభించలేదని మహిళ సభ్యురాలు పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు క్యూలైన్లో భక్తులు గంటల తరబడి నిలవడంతో పరస్పరం గొడవలు పడుతున్నారు భక్తులు.
తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున సింహాద్రి అప్పన్నకు వైవీ సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
శారదాపీఠాధిపతి ఆగ్రహం
విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదల ఆరాధ్య దైవం అయిన సింహాద్రి అప్పన్నను సామాన్య భక్తులకు దూరం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను గుంపులుగా పెట్టారు తప్ప ఏర్పాట్లు సరిగా లేవని విమర్శించారు. తన జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హజరయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈరోజు తాను ఎందుకు దర్శనానికి వచ్చానా అని బాధపడుతున్నానని చెప్పారు. కొండ కింది నుంచి పై వరకు వాహనాల రద్దీ ఏర్పడిపోయిందని, దానికి జవాబు చెప్పేవారే లేరని అసహనం వ్యక్తం చేశారు. అసలు ఇంఛార్జి ఈవోతో ఎలా ఉత్సవాలు జరిపిస్తారని ప్రశ్నించారు.
తన జీవితంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ చూడలేదని, భక్తులు అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన చెందారు. భక్తుల ఇబ్బందుల మధ్య దైవదర్శనం బాధ కలిగించిందని చెప్పారు.
మంత్రులకు చేదు అనుభవం
మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ అక్కడ కనిపించడంతో వారికి వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. సామాన్యులకు త్వరగా దర్శనాలు కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ఏర్పాట్లలో అన్నీ లోపాలే అని, రూ.1500 టికెట్లు కొనుగోలు చేసినా క్యూ లైన్లు కదలడమే లేదని నీలదీశారు. క్యూలైన్ వద్ద మంత్రి కొట్టు సత్యనారాయణను భక్తులు నిలదీశారు. కనీసం తాగునీటి లాంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల ఇబ్బందులపై దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి బొత్స మాట్లాడారు.