Vizag Crime News :  బెంగాల్ విద్యార్తిని  రితీ సాహా అనుమానాస్పద మృతి కేసు విశాఖ పోలీసులకు చిక్కులు తెచ్చి పెడుతోంది.  రితీ సాహా  చనిపోయి నెల దాటినా.. ఇంత వరకు ఆమె చావుకి గల కారణం ఏంటనే అసలు నిజ నిజాలు బయటపడలేదు. పోలీసులు కేసును తారుమారు చేస్తున్నారంటూ రితీ సాహా తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. హాస్టల్‌తో పాటు రెండు ఆస్పత్రుల సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచాలని ఆయన కోరుతున్నారు. వాటిని ట్యాంపరింగ్ చేయడం లేదా.. ధ్వంసం చేయడం చేస్తారని అనుమానిస్తున్నారు. 


అనుమానాస్పదంగా మృతి చెందిన రితీ సాహా 


పశ్చిమ బెంగాల్ కు చెందిన రితీ సాహా అనే అమ్మాయి విశాఖలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతుంది. స్థానికంగా ఉన్న నెహ్రబజార్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్ ఉంటూ కాలేజీకి వెళ్లేది.   గత నెల 14న రాత్రి హాస్టల్ 4వ అంతస్తుపై నుంచి దూకి రితీ సాహా చనిపోయిందని ఆమె తల్లిదండ్రులకు హాస్టల్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన విశాఖకు చేరుకున్నారు. పోలీసులు,  హాస్టల్ సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా రితీ సాహా తల్లిదండ్రులకు చెప్పారు. కానీ  మృతురాలి తల్లిదండ్రులకు కూతురి మరణంపై అనేక అనుమానాలు వచ్చాయి. 


హత్య చేశారేమోనని అనుమానిస్తున్న రితీ సాహా తల్లిదండ్రులు                               


రితీ సాహా తల్లిదండ్రులు ఆ హాస్టల్ ఎదురుగా ఉన్న ఓ సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ సీసీ ఫుటేజ్ చూసి సంచలన నిజాలు తెలుసుకున్నారు. రితీ సాహా 4వ అంతస్తుకు వెళ్లేటప్పుడు ఒక డ్రెస్ లో ఉండగా, కిందపడిపోయేటప్పుడు మరో కలర్ డ్రెస్ లో కనిపించింది. దీంతో పోలీసులు, హాస్టల్ సిబ్బంది ఏదో దాస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూతురుని ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఇక ఇదే సమయంలో రితీ సాహా తల్లిదండ్రులు ఈ కేసును ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం ఆదేశాలతో అక్కడి పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


మమతా బెనర్జీ ఆదేశాలతో కోల్ కతాలో కేసు నమోదు చేసిన బెంగాల్ పోలీసులు                


ఈ కేసుపై విశాఖ పోలీసులు భిన్నంగా స్పందిస్తారు.  రితీ సాహా మృతిపై సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశామని, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత విచారణ చేపడతామని చెబుతున్నారు.  ఇంతకు రితీ సాహా ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? అన్నది మాత్రం స్పష్టత లేకుండా పోయింది. అనుమానాస్పద కేసులో కోల్ కతా పోలీసులు కూడా కేసు నమోదు చేయడంతో సంచలనంగా మారింది. ఇక్కడి పోలీసులు ఏదో దాస్తున్నారన్న ప్రచారం.. రితీ సాహా తండ్రి న్యాయపోరాటం కొత్త సంచలనంగా మారింది.