CII Partnership Summit 2025 : విశాఖ వేదికగా శుక్రవారం నుంచి జరిగే CII భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశానికి పారిశ్రామిక దిగ్గజాలు వస్తున్నారు. ఇప్పటికే పలువురితో ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్ మాట్లాడి వారిని ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అభ్యర్థించిన కంపెనీల్లో గతంలో వెళ్లిపోయిన కంపెనీలు కూడా ఉన్నాయి. ఐదేళ్ల పాలనలో ఇబ్బంది పడి వెళ్లిపోయిన వారిని కూడా ప్రభుత్వం మరోసారి రిక్వస్ట్ చేసింది. దీంతో వారు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి కంపెనీల్లో ఒకటి రెన్యూ సోలార్ కంపెనీ. ఈసారి భారీ పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేందుకు ఈ కంపనీ సిద్ధమైనట్టు లోకేష్ ప్రకటించారు.
బుధవారం సాయంత్రం మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేస్తూ కీలకమైన ప్రకటన గురువారం ఉదయం 9 గంటలకు ఉంటుందని వెల్లడించారు. గతంలో రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన కంపెనీ ఈసారి మరింత పెట్టుబడితో తిరిగి వస్తుందని తెలిపారు. ఆయన ప్రకటన తర్వాత చాలా మంది ఆలోచించారు. అలాంటి కంపెనీ ఏమై ఉంటుందని బుర్రలు బద్దు కొట్టుకున్నారు. ఆ విషయాన్ని నారా లోకేష్ గురువారం ఉదయం 9 గంటలకు ప్రకటించారు. ఈసారి 82వేల కోట్ల పెట్టుబడితో రెన్యూ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టబోతోందని తెలిపారు.
నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ సంస్థ పెట్టుబడులు గురించి ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో ఏం ఉందంటే" ఆంధ్రప్రదేశ్ నుంచి వైదొలిగిన 5 సంవత్సరాలు తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం రెన్యువబుల్ ఎనర్జీ వాల్యూ సప్లైపై Renew పూర్తిగా పెట్టుబడి పెడుతోందని ప్రకటించడం నాకు గర్వకారణం. రూ. 82,000 కోట్ల పెట్టుబడితో, Renew సోలార్ ఇంగోట్, వేఫర్ తయారీ, ప్రాజెక్ట్ అభివృద్ధి వరకు, గ్రీన్ హైడ్రోజన్, అణువుల వరకు హై టెక్నాలజీ రంగాలలో పెట్టుబడి పెడుతుంది. వైజాగ్‌లో జరిగే CII భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశానికి సుమిత్ సిన్హా, ReNewCorp బృందాన్ని వస్తోంది. వారికి నేను స్వాగతిస్తున్నాను." అని వెల్లడించారు.