Visakha Floods:  అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో గల చింతపల్లి, ఎటపాక, వి.ఆర్.పురం, కూనవరం మండలాల్లోని పలు గ్రామాలు గోదావరి, శబరి నదులు పొంగిపొరలటంతో నీట మునిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో చింతూరులో సుమారు 20 అడుగల మేర నీరు చేరింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతూ రావటంతో చింతూరులో కూడా నీరు తగ్గుతూ వచ్చింది. మంగళవారం సాయంత్రం వరకు సుమారు ఆరు అడుగుల నీటి మట్టం ఉన్నప్పటికీ పల్లపు ప్రాంతానికి నీరు ప్రవహించటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. 


ఫైర్ ఇంజిన్ల ద్వారా నీటి తొలగింపు!


జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో ముంపు ప్రాంతాలకు చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల ద్వారా తోడివేయటంతో గ్రామంలో నీటి చుక్క లేకుండా పోయింది. దాంతో భద్రాచలం వెళ్లే రోడ్డు మార్గం వినియోగంలోకి వచ్చింది. అయితే భద్రాచలం వద్ద చట్టి వద్ద కొంత బురదగా ఉండటం వల్ల దాని నిర్మూలనకు అగ్నిమాపక శాఖ కృషి చేస్తోంది. ఈ పనులు పూర్తి అయితే ఆ రోడ్డు పూర్తిగా వినియోగంలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.  


ముంపు ప్రాంతాలలో జీవీఎంసీ సేవలు బేష్..


ఇదిలా ఉండగా, విశాఖ పట్నం జీవీఎంసీ నుంచి కమీషనర్ డా. లక్ష్మీషా గాజువాక జోన్ సహాయ వైద్యాధికారి డా. ఎస్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో 50 మంది శానిటరీ సూపర్ వైజర్లు, మేస్త్రీలు, శానిటరీ సిబ్బందిని పంపించారు. చింతూరు చేరుకున్న జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది రోడ్డును శుభ్రం చేయడంతో పాటు రోడ్డు పక్కన ఉన్న చెత్తను కుప్పలుగా వేసి, జేసీబీ సాయంతో లారీలలోకి చెత్తను చేర వేయటం, వెను వెంటనే ఆ ప్రాంతాన్ని బ్లీచింగ్ చేయటం అన్ని పనులను ఏక కాలంలో పూర్తి చేస్తారు. వారు చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు పరిశీలించిన స్థానిక ప్రజలు సిబ్బందికి ధన్య వాదాలు తెలిపారు. ప్రశంసల వర్షం కురిపించారు.  


ఈ సందర్భంగా సహాయ వైద్యాధికారి డా. కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. కమిషనర్ ఆదేశాలు మేరకు మూడు రోజుల పాటు ఉండి జిల్లాలోని అన్ని ముంపు గ్రామాలను పరిశుభ్రం చేస్తామని తెలిపారు. తద్వారా దోమలు లేకుండా అంటు వ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాస్త వరదలు తగ్గి.. గ్రామాల్లో వరద నీరు తగ్గిన వెంచనే ప్రబుత్వానికి సంబంధించి పారిశుద్ధ్య కార్మికులు రంగంలో దిగి గ్రామాలను శుభ్రం చేస్తే బాగుంటుందని చెప్పారు. ఇలా చేయడం వల్ల అనేక రకాల సమస్యలను తొలగించుకోవచ్చని... వర్షాల వచ్చే దోమలు, సర్పాలు, ఇతర రకాలు విష పురుగుల వంటి వాటి నుంచి ప్రజలను కాపాడవచ్చని వివరించారు.