Rajnath Singh Commissions INS Sandhayak In Visakha: విశాఖపట్నం: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏపీలోని విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ ను రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నావల్ డాక్‌యార్డ్‌లో రాజ్‌నాథ్ సింగ్ ఐఎన్ఎస్ సంధాయక్‌ (INS Sandhayak)ను శనివారం ప్రారంభించారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇండియన్ నేవీ సామర్థ్యాన్ని, వాటి ప్రతిభను, ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. హిందూ మహాసముద్రం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత నావికాదళం ఇప్పుడు మరింత పటిష్టంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. కెప్టెన్‌ ఆర్.ఎం.థామస్‌ సంధాయక్‌ నౌకకు కమాండింగ్‌ అధికారిగా వ్యవహరించనున్నారు.






మొదటగా స్పందించేది మన ఇండియన్ నేవీ: రక్షణ మంత్రి 
భారత నావికాదళం రోజురోజుకూ మరింత పటిష్టంగా మారుతుందన్నారు. హిందూ మహాసముద్రం, ఇండియన్ పసిఫిక్ ప్రాంతంలో ఏదైనా సంభవిస్తే, మొదటగా స్పందించేది మన ఇండియన్ నేవీ అని వెల్లడించారు. ప్రపంచ వాణిజ్యం గురించి చెప్పాలంటే.. హిందూ మహాసముద్రం ఎప్పటికీ ప్రధాన కేంద్రంగా, హాట్‌స్పాట్‌గా పరిగణిస్తారని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రంలో గల్ఫ్ ఆఫ్ ఏడెన్, గల్ఫ్ ఆఫ్ గినియా మొదలైన చౌక్ పాయింట్లు ఉన్నాయి. వీటి ద్వారా పెద్ద మొత్తంలో అంతర్జాతీయ వ్యాపార లావాదేవిలు జరుగుతున్నాయి. అదే సమయంలో అక్కడ ప్రమాదాలు, బెదిరింపులు, దోపిడీలు జరిగే అవకాశం ఉందని.. కానీ వాటిని తిప్పికొట్టే సామర్థ్యం భారత నేవీకి ఉందన్నారు.


భారత నావికాదళం ఇటీవల ఎన్నో రెస్క్యూ ఆపరేషన్‌లను విజయవంతంగా నిర్వహించిందన్నారు. సముద్ర దొంగల్ని, స్మగ్లింగ్‌కు పాల్పడే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని మరోసారి హెచ్చరించారు. ఈ విషయంపై భారత నేవీ ప్రతిజ్ఞ చేస్తోందన్నారు. ఇటీవల 80 మంది మత్స్యకారులను రక్షించామని ఐఎన్ఎస్ సంధాయక్ ను ప్రారంభించిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ గుర్తుచేశారు. వైజాగ్ నేవల్‌ డాక్‌యార్డులో జరిగిన కార్యక్రమంలో రాజ్‌నాథ్‌తో పాటు భారత నేవీ అధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌ పెందార్క, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఎందుకీ ఐఎన్ఎస్ సంధాయక్ నౌక.. 
హైడ్రోగ్రాఫిక్‌ సర్వే జరిపేందుకు ‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ను రూపొందించారు. కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇవ్వడంతో కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్‌ షిప్‌ బిల్డింగ్‌ ఇంజినీర్స్‌ సంస్థ తాజాగా జాతికి అంకితం చేసిన ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ ను నిర్మించింది. 2019లో ఐఎన్ఎస్ సంధాయక్ నిర్మాణం పనులు చేపట్టగా.. 2021 డిసెంబరు 5న జలప్రవేశం చేయించారు. క్రమంగా పూర్తి స్థాయిలో నిర్మాణం పనులు కొనసాగించి తక్కువ సమయానికే ప్రాజెక్టు కంప్లీట్ చేసింది బీఆర్ఎస్ఈ. ఐఎన్ఎస్ సంధాయక్ 3,800 టన్నుల సామర్థ్యం కలిగి ఉంది. దీని పొడవు 110 మీటర్ల పొడు కాగా.. దీనిపై హెలిపాడ్‌, సర్వే టెక్నికల్ ఈక్విప్‌మెంట్స్, రెండు డీజిల్‌ యంత్రాలు అమర్చారు. 


Also Read: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి భారతరత్న, ప్రధాని మోదీ కీలక ప్రకటన