Visakha Express News Today | అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలోని విజయరామరాజుపేటలో రైల్వే బ్రిడ్జి కుంగింది. ఆదివారం రాత్రి భారీ టిప్పర్ వాహనం బ్రిడ్జి కింద నుంచి వెళ్లే క్రమంలో సేఫ్టీ గడ్డర్‌ను ఢీకొట్టింది. దాంతో విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి రైల్వే ట్రాక్ కొంతమేర దెబ్బతింది. అనకాపల్లి నుంచి విశాఖ వెళ్తున్న గూడ్స్ రైలు హెవీ లోడ్ వల్ల నిలిచిపోయింది. ఈ రైలు వల్ల రైల్వే లైన్ బ్లాక్ అయింది.
అనకాపల్లి నుంచి విశాఖ వైపు వెళ్లే పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు విశాఖ - విజయవాడ మార్గంలోనూ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎలమంచిలిలో మహబూబ్ నగర్ ఎక్స్‌ప్రెస్ రైలును అధికారులు నిలిపివేశారు. కశింకోట వద్ద విశాఖ ఎక్స్‌ప్రెస్, గోదావరి ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. హెవీ లోడ్ టిప్పర్ సేఫ్టీ గడ్డర్‌ను ఢీకొనడంతో ట్రాక్ డ్యామేజ్ అయి గూడ్స్ రైలు నిలిచిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతులు కొనసాగుతున్నాయి.
