PM Modi News: విశాఖ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో కీలక ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. వర్చువల్‌గా విశాఖ రైల్వేజోన్‌ ప్రధాన కేంద్రానికి ప్రధాని మోదీ మొదట శంకుస్థాపన చేశారు. తర్వాత పూడిమడకలో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌కు ప్రధాని భూమిపూజ చేశారు.అనంతరం నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు  శిలాఫలకం వేశారు.    కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ నోడ్‌, గుంటూరు-బీబీనగర్‌ లైన్ల డబ్లింగ్‌ పనులను కూడా విశాఖ వేదిక నుంచి ప్రారంభించారు. గుత్తి-పెండేకల్లు రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు శంకుస్థాపన చేశారు. చిలకలూరిపేట 6 లేన్ల బైపాస్‌ను జాతికి అంకితం చేశారు. 


ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ "ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, దేశంలో నరేంద్ర మోదీ పడుతున్న శ్రమను గుర్తు చేశారు. "ప్రతి ఇంటిపై త్రివర్ణపతాకం ఎగురుతుంది. ప్రతి భారతీయుడి గుండెల్లో నమో ఉంటారు. ప్రపంచం భారత్ వైపు చూస్తుందంటే కారణం నమో. ప్రధానమంత్రి అనే పదానికి అర్థం మార్చేశారు. ప్రజల మనిషిగా మారిపోయారు. ఆయన ఆలోచనలు గ్లోబల్‌గా ఉంటాయి. ఆయన మనసు మాత్రం భారతీయమే. పేదల భరోసా నమో. పేదల విశ్వాసం నమో. ఈ దేశానికే ఆశ. పేదల చిరునవ్వు నమో. మహిళ ఆత్మగౌరవం నమో. యువత భవిత నమో. అన్నాదాతల ఆనందం నమో." 


"వికసిత్ భారత్‌ 2047 విడుదల చేసి దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌లో మార్చేందుకు పని చేస్తున్నారు మన నమో. 2014 నాటికి 11 వ స్థానంలో ఉన్న భారత దేశ ఆర్థిక వ్యవను ఐదో స్థానానికి తీసుకొచ్చారు. ఇదే స్ఫూర్తితో స్వర్ణాంధ్ర 2047 అనే లక్ష్యంతో చంద్రబాబు పని చేస్తున్నారు. దిమాక్ ఉన్న వాళ్లు దునియా మొత్తం చూస్తారు. 2020 అంటే నవ్విన వాళ్లు ఇప్పుడు హైదరాబాద్ వెళ్లి చూస్తే అర్థమవుతుంది. గత ప్రభుత్వం అసమర్థ పాలనతో వెంటలేటర్‌పైకి వెళ్లిపోయింది. అలాంటి రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. "