Manyam district Road Accident: పార్వతిపురం మన్యం జిల్లాలో ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. కమరాడ దగ్గర ఆటోను లారీ ఢీ కొట్టిన దుర్ఘటనలో ఐదుగురు చనిపోయారు. వివాహానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. బాధిలంతా అంటివలసకు చెందినవారిగా గుర్తించారు.  


అంతా ఒక ఊరి వారే.. సమీపంలోనే శుభకార్యానికని వెళ్లారు. మధ్యాహ్నం భోజనం చేసి స్వగ్రామానికి ఆటోలో తిరిగి పయనమయ్యారు. విందు ముచ్చట్లు చెప్పుకొంటూ సరదాగా గడిపారు. మరి కాసేపట్లో గమ్యస్థానం చేరుకుంటారు. ఇంతలోనే ఉలికిపాటు.. రెప్ప మూసి తెరిచేలోపే నెత్తురు కారుతున్న చేతులు.. ముద్దయిన శరీర భాగాలు.. హాహాకారాలు.. అప్పటి వరకూ తమతోపాటు కబుర్లు చెబుతున్న వారే.. కళ్లెదురుగా విగతజీవులై పడి ఉన్నారు. ఆటో లారీ ఢీకొన్న సంఘటనలో ఐదుగురు దుర్మరణం పాలైన ఘటన పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చోళపథం వద్ద చోటుచేసుకుంది. 


కొమరాడ మండలం అంటివలస గ్రామానికి చెందిన పలువురు ఆటోలో కూనేరు సమీపంలోని తుమ్మలవలస గ్రామానికి పెళ్లి భోజనాల నిమిత్తం బుధవారం వెళ్లారు. మధ్యాహ్నం భోజనం ముగించుకుని తిరిగి వస్తుండగా.. మార్గమధ్యంలో చోళపథం శివాలయం సమీపంలో మలుపు వద్ద పార్వతీపురం నుంచి రాయగడ వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. ఆ సమయంలో ఆటోలో మొత్తం 13 మంది ఉన్నట్లు సమాచారం. ఆటో తిరగబడి అందులో ఉన్న ఊయక నరసమ్మ(40, మెల్లక శారద(35), ఊయక లక్ష్మి(42), మెల్లక అమ్మడమ్మ(40) చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో రహదారి మొత్తం రక్తసిక్తమైంది. వెంటనే క్షతగాత్రులను 108 వాహనంలో పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఊయక వెంకటి మృతి చెందాడు. ఆటో డ్రైవర్‌ ఊయక వెంకటేష్‌ పరిస్థితి విషమంగా ఉంది. 


స్వగ్రామంలో విషాద ఛాయలు
రహదారి ప్రమాద ఘటన తెలియగానే అటు మృతుల స్వగ్రామమైన అంటివలసతోపాటు, తుమ్మలవలస గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకూ తమతోపాటు సందడిగా గడిపిన వారంతా.. ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామంతోపాటు, ఆసుపత్రిలో మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.