అమరావతి: శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తనకు ప్రాణహాని ఉందని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను కూటమిలోని టీడీపీ నేతలు తిప్పికొట్టారు. బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను చూస్తే, ఆయనకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందేమో అనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) అన్నారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పార్టీ నేతలు తన కంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నా, ఎవరైనా తనను దాటి వెళ్తున్నారని భావిస్తే, జగన్ వారిని తొలగించేందుకు చూస్తారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇందుకు మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనను గుర్తుచేశారు. గతంలో జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్య కూడా ఈ కోవకే చెందుతుందన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయన్నారు.
జగన్ నుంచి బొత్సకు ప్రాణహానిమండలిలో వైసీపీ పక్ష నేతగా బొత్స సత్యనారాయణ ప్రస్తుతం బాగా ఫోకస్ అవుతున్నారు. ఆయనకు వైసీపీ నుంచి, జగన్ నుంచే ప్రాణహాని ఉందని పల్లా శ్రీనివాసరావు అనుమానాలు వ్యక్తంచేశారు. అందుకే తనకు ప్రాణహాని ఉందని బొత్స వ్యాఖ్యలు చేస్తున్నారేమోనని అభిప్రాయపడ్డారు. అవసరమైతే ప్రభుత్వం తరఫున బొత్సకు భద్రతను కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధికి కూటమి కృషిఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తోందని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. సీఎం చంద్రబాబు విజన్, నాయకత్వం వల్లే గూగుల్, టీసీఎస్, మహీంద్ర, లులు, రిలయన్స్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. త్వరలో విశాఖపట్నంలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఏర్పాటు చేస్తుందన్నారు.