MVV Satyanarayana family kidnapping case : విశాఖ ఎంపీగా ఉన్న సమయంలో ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలో పోలీసులు రీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో నిజాలు బయటకు రాలేదని భావిస్తున్న పోలీసులు సీనియర్ అధికారికి రీ ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం రాజకీయంగానూ కలకలం రేపుతోంది.
2023 జూన్ 15వ తేదీన విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ తన కుటుంబం కిడ్నాప్‌కు గురైందని.. సొంత ఇంటిలోనే కిడ్నాపర్లు బంధంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ఆయన హైదరాబాద్‌లో ఉన్నారు. ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు చందుతో పాటు వాళ్ల ఫ్యామిలీకి సన్నిహితుడు, ఆడిటర్, వైఎస్ఆర్ సీపీ నేత అయిన గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ)ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఎంవీవీ సత్యనారాయణ కుమారుని నివాసంలోనే ఈ కిడ్నాప్ జరిగింది.
విషయం పోలీసులకు తెలిసినట్లుగా కిడ్నాపర్లు గుర్తించడంతో వారిని తీసుకుని కారులో పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఫిర్యాదు అందిన వెంటనే ముగ్గురు డీసీపీలతో 15 బృందాలుగా గాలించడంతో ఎనిమిది గంటలలో పోలీసులు కేసును చేధించారు. కిడ్నాపర్ల దగ్గరే ఉన్న ఎంవీవీ స్నేహితుడు గన్నమనేని వెంకటేశ్వరరావు ఫోన్ ట్రాక్ చేయయంతో పద్మనాభం వైపు వెళుతున్నట్టు తెలుసుకున్నారు. పోలీసులు ఆ వైపుగా ఛేజింగ్ చేసి ఎంపీ కుటుంబ సభ్యులను రక్షించారు. ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ కేవలం డబ్బు కోసమే ఈ వ్యవహారం నడిచిందని తనకు ఎవరూ శత్రువులు లేరని తెలిపారు. కిడ్నాపర్లలో ప్రధాన నిందితుడిని హేమంత్‍గా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. రౌడీ షీటర్ అయిన హేమంత్ పై 2 కిడ్నాప్, ఓ మర్డర్ కేసు పెండింగ్‌లో ఉన్నాయి. హేమంత్ ఈ కిడ్నాప్ ద్వారా రూ.50 కోట్లు డిమాండ్ చేశారని పోలీసులు చెప్పారు. ఇప్పటికీ హేమంత్ జైల్లోనే ఉన్నారు.
అయితే పోలీసులు నిజం చెప్పడం లేదని.. ఈ కిడ్నాప్ ఘటన వెనుక భూ వివాదం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని అప్పట్లోనే ఎంవీవీ ఖండించారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరిపితే కిడ్నాపర్లు ఇంట్లో ప్రవేశించిన నాటి నుంచి బయటకు వెళ్ళే వరకూ అన్ని బయటికి వస్తాయని అప్పట్లో అన్నారు కానీ సీబీఐకి ఇవ్వలేదు. ఇప్పుడు పోలీసులు మొత్తం బయటకు తీసుకు వచ్చేందుకు విచారణ ప్రారంభిస్తున్నారు.
ఎన్నికల్లో ఓడిన తర్వాత ఎంవీవీ సత్యనారాయణ పెద్దగా బయట కనిపించడం లేదు. వివాదాస్పదమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధంగా ఉందని.. స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చారు. హయగ్రీవ భూముల కేసులో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ కూడా రాలేదు. దాంతో ఆయన విశాఖలో ఉండటం లేదని చెబుతున్నారు.