విశాఖ పట్టణంలో ఘోరం జరిగింది. ఇద్దరు పిల్లలతో పాటు తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మర్రిపాలెంలోని ప్రకాష్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న మహిళను సంధ్యగా గుర్తించారు.
సంధ్య, ఆమె భర్త ఇద్దరు పిల్లలతో కలిసి ఓ అపార్ట్‌మెంట్ లో ఉంటున్నారు. ఆ అపార్ట్ మెంట్ కి సంధ్య భర్త వాచ్ మెన్ గా ఉండగా, సంధ్య ఆ అపార్ట్ మెంట్ లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటుంది.
వీరికి గౌతమ్ (9), అలేఖ్య (5) అనే పిల్లలు ఉన్నారు. మంగళవారం ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. ఇద్దరు పిల్లలతో కలిసి సంధ్య ఆత్మహత్య చేసుకుంది. గత రాత్రి నుంచి పిల్లలు, సంధ్య కనపడకపోవడంతో భర్త ఆందోళనకు గురయ్యాడు. వెంటనే అందరికీ సమాచారం అందించాడు.
అపార్ట్ మెంట్ లోని నీటి సంపు డోర్ తీసి ఉంచడంతో అనుమానం వచ్చి అందులో వెతకగా.. మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో సంపులో నుంచి మృతదేహాలను బయటకు తీసి.. పోలీసులకు సమాచారం అందించారు. సంధ్యతోపాటు పిల్లలు కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు భర్త కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అయితే సంధ్యకు, ఆమె భర్తకు ఎలాంటి విభేదాలు లేవని, ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమి లేవని అపార్ట్‌మెంట్ వాసులు చెబుతున్నారు. కానీ పిల్లలను స్కూల్ కి తీసుకుని వెళ్లే ఆటో వ్యక్తితో సంధ్య సన్నిహితంగా ఉండటంతో .. ఇది కరెక్ట్ కాదని హెచ్చరించినట్లు వారు చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఇలా ఆమెతో పాటు ఏమీ తెలియని చిన్న పిల్లల్ని కూడా చంపడం దారుణమని అపార్ట్ మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సంధ్య భర్తని, ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతదేహాలను బయటకు తీసి కేజీహెచ్ కు తరలించారు.