Vizag News : వినాయక చవితి పండుగ అంటే.. ఉంటే సందడి అంతా నిమజ్జనం రోజునే. అయితే నిమజ్జనం వల్ల చెరువులు కలుషితం అవుతున్నాయని చాలా కాలంగా పర్యావరణ వేత్తలు ఆందోళన వక్తం చేస్తూ వస్తున్నారు. పర్యావరణం కోసం మట్టి విగ్రహాలనే పెట్టాలని ప్లాస్టర్ ఆప్ ప్యారిస్ వద్దని ప్రచారం కూడా చేస్తున్నారు. కానీ జరిగే నిమజ్జనాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే హైదరాబాద్ లాంటి చోట్ల ప్రత్యేకంగా మినీ చెరువులను తవ్వించి అక్కడ నిమజ్జనాలు చేయాలని సూచిస్తున్నారు. ఈ విషయంలో విశాఖ అధికారులు మరింత వినూత్నంగా ఆలోచించారు. ఏకంగా చెరువులను ఇంటి వద్దకే పంపిస్తాం.. అక్కడే నిమజ్జనం చేయండి అని ప్రజలకు పిలుపునిస్తున్నారు. చెరువులను ఎలా పంపిస్తారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.. అయితే ట్యాంకుల్ని అలా చెరువుల్లా మార్చి పంపుతారన్నమాట.
నిమజ్జనానికి మొబైల్ ట్యాంకులు ఏర్పాటు చేసిన జీవీఎంసీ అధికారులు
వినూత్నంగా వినాయక నిమజ్జనం చేపట్టేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. బొజ్జ గణపయ్య విగ్రహాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిమజ్జనం చేసేందుకు మొబైల్ ట్యాంకులను ప్రవేశపెట్టింది. కృత్రిమ ట్యాంకుల ట్రయల్ రన్ ముగిసిన తర్వాత వాటిని విశాఖ నగరంలోని వివిధ ప్రదేశాల్లో అందుబాటులో ఉంచి ఇళ్లలో ప్రతిష్టించి పూజించిన గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయడంలో సహాయపడాలని ప్రయత్నిస్తున్నారు. గ్రేటర్ విశాఖ పరిధిలోని అన్ని మండలాలను కలుపుతూ 16 కృత్రిమ మొబైల్ నిమజ్జనం ట్యాంకులు నిలిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అవసరాన్ని బట్టి వీటి సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించారు.
లారీల్లో వాటర్ లీక్ కాకుండా నీళ్లు నింపి అందులోనే నిమజ్జనం
మొబైల్ నిమజ్జనం కోసం కృత్రిమ ట్యాంక్‌లను సిద్ధం చేశారు. 10X16 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో భారీ వాహనాలను ఇందు కోసం తీర్చిదిద్దారు. వీటిని నీటితో నింపి ఆగస్టు 31 నుంచి వివిధ పాయింట్లలో ఉంచనున్నారు. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఇలాంటి పర్యావరణ అనుకూల నిమజ్జన పద్ధతులను అనుసరిస్తున్నారని, విశాఖలో ఇదే మొదటిసారి అని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీశ చెబుతున్నారు. విగ్రహాలను నిమజ్జనం చేసి సముద్రాన్ని కలుషింతం చేయకుండా నిలువరించేందుకు ఈ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
మట్టి గణపతులు పెట్టిన వారికి సెల్ఫీ పోటీ..బహుమతులు కూడా !
విశాఖపట్నం ప్రజానీకాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా కార్పొరేషన్ సెల్ఫీ పోటీని కూడా అందుబాటులోకి తెచ్చింది. మట్టి విగ్రహాలతో గణపతిని పూజించిన వారు సెల్ఫీ దిగి పంపి బహుమతులు గెలుచుకోవచ్చునని జీవీఎంసీ అధికారులు వెల్లడించారు. విశాఖలో మట్టి విగ్రహాలు పెట్టాలనే క్యాంపెయిన్ కూడా చాలా కాలంగా విస్తృతంగా నడుస్తోంది. ఈ కారణంగానే విశాఖలో ఎక్కువగా పందిళ్లలో కూడా మట్టి విగ్రహాలనే పెడుతూ ఉంటారు. ఇప్పుడు నిమజ్జనం కూడా ఇలా ఇంటి వద్దకే వచ్చే ఏర్పాట్లు చేయడంతో ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రచారానికే పరిమితం కాకుండా నిజంగా ఈ కాన్సెప్ట్‌ను సక్సెస్ చేయాడనికి ప్రయత్నించాలని అధికారులకు హితవు పలుకుతున్నారు.