పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు విశాఖపట్నంలో చేదు అనుభవం ఎదురైంది. విశాఖ శారదా పీఠం వద్దకు వచ్చిన ఆయన లోనికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. గేటు వద్దే ఆయన్ను నిలిపివేసి ఓ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ అడ్డుకున్నారు. లోనికి వెళ్లానుకుంటే మంత్రి ఒక్కరు వెళ్లవచ్చని, ఆయన అనుచరులను లోనికి అనుమతించేది లేదని సీఐ తేల్చి చెప్పారు. మంత్రి బతిమాలినా సీఐ అందర్నీ లోనికి అనుమతించలేదు. దురుసుగా గేటు వేసేసి వెళ్తే మంత్రి ఒక్కరే లోపలకి వెళ్లే అవకాశం ఉందని, ఇతరులు వెళ్లడానికి వీల్లేదని ఖరాకండిగా చెప్పేశారు. ఈ క్రమంలో గేటు వద్ద మంత్రిని సర్కిల్ ఇన్స్ పెక్టర్ దుర్భషలాడారు. 


దీంతో తనకు క్షమాపణలు చెప్పాలని మంత్రి అప్పలరాజు డిమాండ్ చేశారు. మంత్రికి క్షమాపణలు చెప్పాలని అనుచరులు కూడా డిమాండ్ చేశారు. ఇలా వాగ్వివాదం కొద్ది సేపు జరిగినా సీఐ క్షమాపణలు చెప్పక పోవడంతో చివరికి చేసేది లేక మంత్రి అలిగి వెనక్కి వెళ్లిపోయారు.


హాజరైన సీఎం జగన్
విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవం జరగుతోంది. ఇందులో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. విశాఖ శారదా పీఠంలో రాజ్యశ్యామలాదేవి పూజలో సీఎం జగన్‌ పాల్గొంటారు. శారదా పీఠంలో ఏర్పాటు చేసిన పండిత సభకూ హాజరవుతారు. ఇందుకోసం బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు బయల్దేరి వచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి శ్రీ శారదా పీఠానికి చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు శ్రీ శారదా పీఠంలోని పలు కార్యక్రమల్లో పాల్గొంటారు. ఏటా మాఘ మాసం పంచమి నుంచి దశమి వరకు శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు జరుగుతాయి. దేశ రక్షణ కోసం 5 రోజుల పాటు శ్రీ శారదా పీఠం.. రాజ్యశ్యామల అమ్మవారి యాగం నిర్వహిస్తుంటుంది.


శ్రీ శారదా పీఠంలో మూడో రోజు రాజశ్యామలాదేవి యాగం కొనసాగుతోంది. రుత్వికులు లక్ష సార్లు అమ్మవారి నామార్చన చేస్తున్నారు. వనదేవత.. రాజ శ్యామల దేవి అమ్మవార్లకు పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పూజలు చేశారు. చతుర్వేద పారాయణం మధ్య హోమం కొనసాగుతోంది.