దక్షిణ బంగాళాఖాతంలో అండమాన్ తీరంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉంది. మే 10న ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరాలకు చేరుకోవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృతుంజయ్ మహపాత్ర తెలిపారు. అల్పపీడన ప్రాంతం వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా, తూర్పు-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని చెప్పారు. ఆదివారం సాయంత్రం నాటికి అల్పపీడనం మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

పశ్చిమ బెంగాల్‌లో ఉరుములు, భారీ వర్షాలు

ఐఎండీ ప్రకటన ప్రకారం, తుపాను ఏర్పడే అవకాశం ఉన్నందున, మే 10, 13 మధ్య గంగా పశ్చిమ బెంగాల్ జిల్లాల్లో ఉరుములు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అల్పడీనం తుపానుగా మారితే దానికి అసని అని పిలవనున్నారు. దీనికి శ్రీలంక పెట్టింది. సింహళ భాషలో అసని అంటే కోపం.

బెంగాల్‌లో మే 10, 13 మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 10 నుంచి కోల్‌కతాలో శక్తివంతమైన పిడుగులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. అసలు ప్రభావం తుపాను గమనంపై ఆధారపడి ఉంటుంది.

అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉందని IMD సీనియర్ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలిపారు. "ఇది మే 10 సాయంత్రం వరకు వాయువ్య దిశగా కదులుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరంలో వాయువ్య బంగాళాఖాతం వైపు కదులుతుంది" అని ఆయన తెలియజేశారు. 

మే 10 నుంచి ఒడిశా మీదుగా ఉత్తరాంధ్రలో గంటకు 70-80 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. జగత్‌సింగ్‌పూర్, గంజాం, ఖోర్ధా జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఒడిశా తీరప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.

ఈ ప్రాంతంలో మూడేళ్లుగా వేసవిలో తుపాను వస్తున్నాయి. 2021లో 'యాస్', 2020లో 'అంఫాన్', 2019లో 'ఫణి' తుపాను ఈ ప్రాంతాన్ని కుదిపేసింది. మే 7న అల్పపీడనం ఏర్పడిన తర్వాతే తుపాను, గాలి వేగం, తీరందాటే ప్రదేశానికి సంబంధించిన వివరాలను IMD అందించనుంది. మే 9 నుంచి సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు. తుపాను వేగం సముద్రంలో గంటకు 80-90 కి.మీల వేగంతో కొనసాగుతుంది" అని మహపాత్ర చెప్పారు. సముద్రంలో మత్స్యకారుల రాకపోకలపై నిఘా ఉంచేందుకు భారత నావికాదళం, కోస్ట్‌గార్డ్‌లను అప్రమత్తం చేశారు. 

ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య తీరం దాటుతుందా?

తుపాను ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య తీరాన్ని తాకుతుందా లేదా అనేది ప్రస్తుతానికి తెలియడం లేదు. "ఇది ఎక్కడ తీరం దాటుతుందనేది మేము ఇంకా ఎటువంటి అంచనా వేయలేదు. తీరం దాటే సమయంలో వీచే గాలి వేగంపై కూడా మేము ఏమీ చెప్పలేకపోతున్నాం. " అని IMD DG మృతుంజయ్ మహపాత్ర తెలిపారు.