మే 7, 2020... రెండేళ్ల క్రితం ఇదే రోజు విశాఖలో కనీవినీ ఎరుగని దారుణం జరిగింది. నగరం సమీపంలోని ఎల్జీ పాలిమర్స్ కర్మాగారం నుంచి ప్రమాదకరమైన స్టైరీన్ గ్యాస్ లీకవడంతో ఆ పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నిలుచున్నవారు నిలుచున్నట్టే రోడ్డుపై కుప్పకూలిపోగా, మరికొందరు నిద్దట్లోనే ప్రాణాలు వదిలేశారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఏకంగా 300 మంది సృహ తప్పిపోయి.. వాంతులు చేసుకుంటూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.


ఎల్జీ పాలిమర్స్‌ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రభుత్వ ఇండస్ట్రీస్ పాలిసీపై అందరూ ప్రశ్నలు సంధించారు. దీంతో హుటాహుటిన విశాఖ వెళ్లారు సీఎం జగన్. ఫ్యాక్టరీ యజమానులతో మాట్లాడి మృతులకు కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు . అలాగే అక్కడో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి బాధితుల చికిత్సకు అన్ని ఏర్పాట్లూ చేస్తామన్నారు. 


ఇప్పటికీ అమలు కానీ హామీలు


ఈ సంఘటన జరిగి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ ప్రభుత్వం వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఆరోజు ఘటనలో ఆరోగ్యం దెబ్బతిన్న వారు నేటికీ అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానమైన సమస్య ఏంటంటే స్టైరీన్  గ్యాస్ పీల్చిన వారికి వైద్యం ఎలా అందించాలో ఇక్కడి డాక్టర్లకు తెలియకపోవడం. అందుకే స్థానికంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే నీరు కలుషితం కావడంతో అందరికీ ఆర్వో ప్లాంట్ ద్వారా రక్షిత నీరు అందిస్తామంది. అయితే రెండేళ్లు గడిచినా ఈ హామీలు మాత్రం నెరవేరనే లేదు. ఇప్పటికే ఇక్కడి బాధితులు, గట్టిగా మాట్లాడితే ఆయాసం, ఒంటిపై దద్దుర్లు, కడుపులో మంట, కళ్ళు మంటలు, అలసట సమస్యలతో బాధపడుతున్నారు. 


పరిహారమూ అందలేదు 


మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇచ్చిన ప్రభుత్వం బాధితుల్ని మాత్రం గాలికి వదిలేసింది అంటున్నారు ఇక్కడి ప్రజలు. ఆరోజు ప్రాథమిక చికిత్స తీసుకున్న వారికి 25000 పరిహారం ఇస్తామని చెప్పినా ఆ హామీ ఇంకా నెరవేరనే లేదంటున్నారు వారు. అలాంటి వారు ఏకంగా 145 మంది ఉన్నారు. తాత్కాలికంగా ఒక ఆరోగ్య కేంద్రం అంటూ స్థానిక పాఠశాలలో ఒక గదిని కేటాయించి ఆర్భాటం చేసిన ప్రభుత్వం బడులు తెరవగానే దాన్ని కూడా మూసివేసింది అని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇక ఆరోగ్య కార్డులు అంటూ 20 పేజీల పుస్తకాన్ని కొందరికి ఇచ్చినా .. అవి ఇప్పడు ఎందుకూ ఉపయోగపడడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను ఎప్పటికి నిలబెట్టుకుంటుందో అని వారు ఎదురుచూస్తూనే ఉన్నారు.