విశాఖ కార్పొరేషన్‌కు చెందిన కార్పొరేటర్లు, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ కులుమనాలిలో చిక్కుకున్నారు. స్టడీ టూర్ కోసం 140మంది బస్సుల్లో దిల్లీ వెళ్లారు. భారీ వర్షాలు కారణంగా కులుమనాలి ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. చండీగఢ్ వెళ్తున్న విశాఖ కార్పొరేటర్లు ఈ దుర్ఘటనలో ఇరుక్కుపోయారు.
చండీగఢ్‌కు 240 కిలోమీటర్ల దూరంలో కులుమనాలి ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యాయి. దాదాపు పది కిలోమీటర్ల మేరక వాహనాలు బారు తీరాయి. విశాఖ నుంచి వెళ్లిన కార్పొరేటర్లు, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ బస్సుల్లోనే తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాత్రి నుంచి తిండి నీరు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు విశాఖ నగరపాలక కార్పొరేటర్లు. రోడ్లుపైనే బస్సుల్లో ఉంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మంత్రి అమర్‌నాథ్‌ను సంప్రదించారు. ప్రభుత్వంతో మాట్లాడి సహాయక చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తామని కార్పొరేటర్లకు ఆయన హామీ ఇచ్చారు.
కులుమనాలిలో జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా సహాయక చర్యలు ముందుకు సాగడం లేదు. వర్షం కారణంగా భారీగా రాళ్లు రోడ్లుపైకి జారి పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సహాయ చర్యలు చేపట్టడానికి యంత్రాంగం భయపడుతోంది. వర్షం పూర్తిగా తగ్గితే తప్ప ఎలాంటి సహాయం చేయలేమంటున్నారు.
వర్షం తగ్గేంత వరకు ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని సూచిస్తున్నారు కులుమనాలి అధికారులు. కొండ చరియలు భారీగా పడుతున్నందున ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ఎక్కడకిక్కడ వాహనాలు నిలిపేశారు. ఈ కారణంగా ఆ రోడ్డు మొత్తం వందల వాహనాలు నిలిచిపోయాయి.
ఈ నెల 16 న స్డడీ టూర్‌కు వెళ్లారు గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు. ఈ టూర్‌లో ఉన్న విశాఖ నగర పాలక సంస్థకు చెందిన 95 మంది కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వీళ్లంతా కులు మునిసిపాలిటీలో సందర్శన ప్రదేశాలను చూసి చండీగఢ్ బయల్దేరారు. ఈ క్రమంలోనే మింద్‌ప్రాంతంలో వీళ్లంతా చిక్కుకున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, కులుమనాలిని సందర్శించారు కార్పొరేటర్లు.