Srikakulam Latest News: ఇళ్లు కూల్చినట్లయితే పెద్ద పండుగ చేసుకోలేం. పండుగ అయిన తరువాత స్వచ్ఛందంగా మేము వెళ్లిపోతాం అన్న హృదయవిచారకరమైన మాటలు నిర్వాసితులవి. అయినా అప్పటి ప్రభుత్వం నిర్వాసితులపై కనికరం చూపలేదు. సమస్యలు పరిష్కారం కాకుండానే బలవంతంగా ఇళ్లను కూల్చేశారు. దీంతో నిర్వాసితులు చెట్టుకొకరు... పుట్టకొకరు మాదిరిగా వేర్వేరు ప్రాంతాల్లో నిర్వాసితులకు అందజేసిన పునరావాస కాలనీలకు వెళ్లిపోయారు. కానీ నిర్వాసితుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా పరిష్కారం కాని సమస్యలు అలానే ఉండిపోయాయి
మార్కెట్ వ్యవస్థ పతనం...
వంశధార జలాశయం నిర్మాణ మూలంగా ప్రధానంగా హిరమండలం మండలంలో మార్కెట్ వ్యవస్థ పూర్తిగా పతనం అయ్యింది. వ్యాపారస్తులకు వ్యాపారాలు లేక ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. మండలానికి పంచరత్న గ్రామాలు వేరే ప్రాంతాలకు తరలివెళ్లిపోవటంతో చిరువ్యాపారస్తులతోపాటు వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. రానున్న రోజుల్లో వంశధార జలాశయం ప్రాంత పరిధిలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దినట్లయితే వ్యాపారాలు తిరిగి జీవితాలు బాగుంటాయని వ్యాపారస్తులు ఆశలు పడుతున్నారు.
నిర్వాసితుల సమస్యపై వినతి పత్రం అందజేసినా..
వంశధార జలాశయంలో సర్వం కోల్పోయిన నిర్వాసితుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు ఐటి, విద్యాశాఖామంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వినతి పత్రం అందజేశారు. దీనిపై వారు కూడా సానుకూలంగా స్పందించారు. నిర్వాసితులకు తప్పకుండా మేలు జరిగేలా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయటం జరుగుతుందని చెప్పారు. నిర్వాసితులకు తప్పకుండా మేలు జరుగుతుందని ఆశపడ్డారు.
పరిష్కారం కాని సమస్యలు ఎన్నో:
సర్వం అర్పించిన నిర్వాసితుల సమస్యలు చాలా ఉన్నాయి. యువతకు అందాల్సిన యూత్ ప్యాకేజితో పలువురు నిర్వాసితులకు 5 సెంట్ల పునరావాస స్థలం కల్పించాల్సి ఉండగా రెండున్నర సెంట్లు మాత్రమే ఇచ్చారు. నిర్వాసిత గ్రామాల్లో దేవాలయాల నిర్మాణాలు, శ్మశాన వాటికలు, రహదారులు, మురుగు కాలవల నిర్మాణాలు చేపట్టలేదు. గత ప్రభుత్వ హయాంలో పునరావాస కాలనీల్లో అభివృద్ధి జాడ కనిపించలేదు. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వ హాయాంలో నెరవేరుతుందని ఆశలు ఉన్నాయి.
నిర్వాసితులకు అన్యాయం జరిగింది..
నిర్వాసితులకు చాలా అన్యాయం జరిగింది. యూత్ ప్యాకేజితోపాటు పునరావాస స్థలం కేటాయింపులో కూడా కొంత మంది యువతకు ప్యాకేజి అందజేశారు. 18 సంవత్స రాలు నిండిన యువతకే యూత్ ప్యాకేజి ఇవ్వటం దారుణం. కొంత మంది యువత రెండు, మూడు నెలలు తక్కువుగా ఉన్న యువతకు ప్యాకేజి అందచేయలేదు. నిర్వాసిత గ్రామాలు తొలగించిన సమయం వరకు ఉన్న యువతకు ప్యాకేజి అందివ్వలేదు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లాం. కానీ సమస్య పరిష్కారం కాలేదు.
మౌలిక సదుపాయాలు లేవు
నిర్వాసితులకు కేటాయించిన పునరావాస కాలనీల్లో పూర్తి మౌలిక సదుపాయాలు లేవు. రహదారులు, డ్రైనేజి వ్యవస్థ సక్రమంగా లేదు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీలు లేవు. దేవాలయాల నిర్మాణాలు జరగలేదు. పునరావాస కాలనీలో పూర్తి మౌలిక అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సదుపాయాలపై సారించాలి. నిర్వాసితులు కోలుకోలేని దెబ్బ తీశారు.
ఏళ్లు గడుస్తున్నాయి కానీ సమస్య మాత్రం తీరడం లేదని వాపోతున్నారు నిర్వాసితులు. పరిష్కారం అవుతుందని నాయకులు చుట్టూ తిరిగామని ఈ ప్రభుత్వంలో నాయకులు చుట్టూ తిరుగుతున్నామని అంటున్నారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను చూస్తే సమస్య తీరిపోతుందని అనుకున్నా నేటికీ కార్యరూపం దాల్చలేదని అంటున్నారు. ఎన్నికలైన తర్వాత నేతల వద్దకు వెళ్తే ఇదిగో అదిగో అంటున్నారని చెబుతున్నారు. సమస్యలు మాత్రం తీర్చే నాయకుడే కరువయ్యారంటున్నారు. పూర్తి స్థాయిలో నగదు పరిహారం కూడా అందలేదని నరకయాత్ర అనుభవిస్తున్నామంటున్నారు.