JanaSena PAC Chairman Nadendla Manohar: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటనపై జనసేన పార్టీ విమర్శలు గుప్పించింది. సీఎం జగన్ గాల్లో ప్రయాణిస్తుంటే.. రోడ్డుపై వాహనాలు ఆపడమేంటి? అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి అడుగు బయటపెడితే హెలికాప్టర్‌ ఎక్కే సీఎం వైఎస్ జగన్‌ రెడ్డికి హైవే మీద వాహనాలు ఏవిధంగా అడ్డంకి అవుతాయో అర్థం కావడం లేదన్నారు. 


బుధవారం విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయానికి రెండోసారి శంకుస్థాపన కోసం ఏపీ సీఎం జగన్‌ గాల్లో ప్రయాణించి వెళ్లారు. కానీ శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర, అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు నిలిపివేయడం విచిత్రంగా ఉందని ఓ లేఖలో పేర్కొన్నారు. సీఎం గాల్లో పర్యటిస్తున్నా.. గంటల తరబడి వాహనాలు ఆపేయడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.






సీఎం జగన్ రోడ్డు మీదకు వస్తే పరదాలు కట్టించుకోవడం,  దుకాణాలు మూసివేయడం లాంటి చర్యలు చూస్తుంటే ఆయనకు రోజు రోజుకీ అభద్రతా భావం పెరిగిపోతుంద్నారు. మరోవైపు పోలీసుల అత్యుత్సాహానికి పరాకాష్టగా.. భోగాపురానికి అటూ ఇటూ 150 కిలోమీటర్ల మేర దూరాన హైవేపై వాహనాలు ఆపేశారని, దీని వల్ల సామాన్యులు ఇబ్బందులు పడ్డారని ప్రస్తావించారు. సీఎం జగన్ భోగాపురం పర్యటన సందర్భంగా నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని జనసేన నేతలు తుమ్మి లక్ష్మీరాజ్‌, పతివాడ కృష్ణవేణి, అచ్చెన్నాయుడు, కారి అప్పలరాజు తదితరులను అరెస్టు చేయడం, గృహనిర్బంధాలు చేయడం అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్య దేశంలో ఏ తప్పు చేయకున్నా తమ నేతలను అక్రమ నిర్బంధాలను ఖండిస్తున్నట్లు ఓ ప్రకటనలో నాదెండ్ల మనోహర్ తెలిపారు.


భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన 
2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో భోగాపురంలో నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఇక్కడ నుంచి మూడేళ్లలో తొలి విమానం నడిచేలా నిర్మాణ సంస్థ జీఎంఆర్‌ ప్లాన్ చేస్తోంది. ఒకేసారి ఇరవైకి పైగా విమానాలు దిగేలా ఈ ఎయిర్‌పోర్టును తీర్చిదిద్దనున్నారు. మూడు దశల్లో దీన్ని పూర్తి చేయనుంది. మొదటి దశలో 60 లక్షళ మంది, రెండో దశలో 1.20 కోట్ల మంది, మూడో దశలో 1.80 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించేలా నిర్మించనున్నారు. 


విశాఖ డేటా సెంటర్‌కు శంకుస్థాపన 
రుషికొండ హిల్ నెంబర్ 4లో అదానీ - వైజాగ్ డేటా సెంటర్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు.  ఈ కార్యక్రమానికి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ హాజరు కాలేదు. ఆయన ఇద్దరు కుమారులు, అదానీ గ్రూప్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న  జీత్, కరణ్ అదానీలు హాజరయ్యారు.  విశాఖపట్నం డాటా టెక్నాలజీకి సెంటర్ గా మారుతుందని ఈ సందర్భంగా  కరణ్ అదానీ విశ్వాసం వ్యక్తం చేశారు. 


అదానీ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా 1,860 మందికి ఉపాధి లభించనుండగా, ఐటీ బిజినెస్ పార్క్ ద్వారా 32 వేల మందికి పైగా ఉపాధి దొరకనుందని ప్రభుత్వం చెబుతోంది.  అలాగే స్కిల్ కాలేజీ, రీక్రియేషన్ సెంటర్ల ద్వారా మరో 3 వేల మందికిపైగా ఉపాధి దొరికే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొదట కేటాయించిన 130 ఎకరాల్లో 82 ఎకరాలు డేటా సెంటర్ కు, ఐటీ బిజినెస్ పార్కుకు 28 ఎకరాలు, స్కిల్ కాలేజీకి 11 ఎకరాలు, రిక్రియేషన్ కేంద్రానికి 9 ఎకరాలను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. భూమి పూజ జరిగిన తర్వాత వెను వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని ప్రకటించింది.