అమరావతి: విశాఖపట్నంలోని కాపులుప్పాడలో మరో అత్యాధునిక ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ లిమిటెడ్ (Quarkx Technosoft Limited) ఈ ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం సంస్థ సుమారు రూ. 115 కోట్లు పెట్టుబడి రానుంది. ఈ క్యాంపస్ ద్వారా ప్రత్యక్షంగా 2 వేల మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
ఈ విభాగాలపై ఫోకస్
ఈ కొత్త క్యాంపస్‌లో అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక విభాగాలపై దృష్టి సారించనున్నారు. ప్రభుత్వం ఈ సంస్థకు ఎకరం రూ. కోటి చొప్పున, మొత్తం 4 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రెండేళ్లలో తొలి దశ కార్యక్రమాలు ప్రారంభం
క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ లిమిటెడ్ సంస్థ రెండేళ్లలో క్యాంపస్ తొలి దశ కార్యకలాపాలను ప్రారంభించాలని, అలాగే మొత్తం ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 ప్రకారం ఈ సంస్థకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులను ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగం కార్యదర్శి కాటమనేని భాస్కర్ జారీ చేశారు. తదుపరి చర్యలు తీసుకోవాలని టీఎస్ ఎండీ మరియు ఏపీఐఐసీ ఎండీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
విశాఖలో 1.35 లక్షల కోట్లతో గూగుల్ కు చెందిన అనుబంధ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వంతో ఇటీవల ఒప్పందం చేసుకుంది. ఆపై మరో కంపెనీ సైతం దాదాపు 80 వేల నుంచి లక్ష కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పలు ప్రముఖ ఐటీ కంపెనీలు విశాఖలో ఐటీ క్యాంపస్, డేటా సెంటర్లు ఏర్పాటు చేయడాని రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దాంతో కొంత కాలానికే డేటా సెంటర్ల హబ్‌గా విశాఖ రూపురేఖలు మారిపోనున్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.